Rajastan : బహిరంగ సభలో మైక్‌ను నేలకేసి కొట్టిన సీఎం గెహ్లాట్.. కారణం ఏంటో తెలుసా...

ABN , First Publish Date - 2023-06-04T10:17:29+05:30 IST

రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ తీవ్ర అసహనానికి గురయ్యారు.

Rajastan : బహిరంగ సభలో మైక్‌ను నేలకేసి కొట్టిన సీఎం గెహ్లాట్.. కారణం ఏంటో తెలుసా...

జైపూర్ : రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ (Rajasthan Chief Minister Ashok Gehlot) తీవ్ర అసహనానికి గురయ్యారు. బార్మర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మైక్ సక్రమంగా పని చేయకపోవడంతో ఆయనకు విసుగొచ్చి, దానిని నేలకేసి కొట్టారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.

మహిళల కోసం రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి గెహ్లాట్ శుక్రవారం రాత్రి బార్మర్ సర్క్యూట్ హౌస్‌లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పథకాల లబ్ధిదారులైన మహిళలు హాజరయ్యారు. ఈ పథకాల అమలు తీరును వారిని అడిగేందుకు గెహ్లాట్ ప్రయత్నించారు. ఆయన కుర్చీలో కూర్చుని ఉండగా, ఆయనకు ఎడమవైపున జిల్లా కలెక్టర్ నిల్చుని ఉన్నారు. మహిళలతో మాట్లాడేందుకు గెహ్లాట్ ప్రయత్నించినపుడు, ఆయనకు ఇచ్చిన మైక్ పని చేయలేదు. దీంతో ఆయనకు తీవ్ర అసహనం కలిగింది. వెంటనే ఆయన తనకు ఎడమవైపునకు ఆ మైక్‌ను విసిరేశారు. కలెక్టర్ ఆ మైక్‌ను తీసుకొని, మరో మైక్‌ను గెహ్లాట్‌కు ఇచ్చారు.

గెహ్లాట్ మైక్‌ను జిల్లా కలెక్టర్‌పైకి విసిరికొట్టారని జరిగిన ప్రచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. మైక్‌ను జిల్లా కలెక్టర్‌పైకి గెహ్లాట్ విసరలేదని తెలిపింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళల వెనుకవైపు నిల్చున్న కొందరు వ్యక్తులు వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పడంతో గెహ్లాట్ మరోసారి అసహనం ప్రదర్శించారు. పోలీసు సూపరింటెండెంట్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఎస్పీ, కలెక్టర్ దొందూ దొందే అన్నట్లు కనిపిస్తున్నారన్నారు.

గెహ్లాట్‌తో మహిళలు మాట్లాడుతూ, అగన్వాడీ వర్కర్లకు గౌరవ వేతనాన్ని పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పథకాల వల్ల తమకు మేలు జరుగుతోందని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Katakam Sudarshan: మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై మోదీకి కాంగ్రెస్ సూటి ప్రశ్నలు

Updated Date - 2023-06-04T10:22:44+05:30 IST