Rahul vs Modi : రాహుల్‌ వర్సెస్‌ మోదీ

ABN , First Publish Date - 2023-03-31T03:55:01+05:30 IST

తాను ఏ గడ్డపై నుంచి చేసిన వ్యాఖ్యలకుగాను పరువునష్టం కేసు ఎదుర్కొని, అందులో ఓడిపోయి, లోక్‌సభలో అనర్హత వేటుకు గురయ్యారో.. అదే కోలార్‌ గడ్డపై నుంచి కర్ణాటక అసెంబ్లీ ..

Rahul vs Modi : రాహుల్‌ వర్సెస్‌ మోదీ

ఇద్దరు అగ్రనేతల మధ్య పోరుగా కర్ణాటక ఎన్నికలు!

కోలార్‌ నుంచే రాహుల్‌ సమర శంఖం!

హస్తానికి కలిసొస్తున్న అనర్హత వేటు అంశం

కోలార్‌లో చేసిన వ్యాఖ్యలపైనే శిక్ష

5న అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని

ప్రారంభించాలని రాహుల్‌ గాంధీ నిర్ణయం

‘సత్యమేవ జయతే’ పేరిట ఉద్యమానికి ప్లాన్‌

న్యూఢిల్లీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): తాను ఏ గడ్డపై నుంచి చేసిన వ్యాఖ్యలకుగాను పరువునష్టం కేసు ఎదుర్కొని, అందులో ఓడిపోయి, లోక్‌సభలో అనర్హత వేటుకు గురయ్యారో.. అదే కోలార్‌ గడ్డపై నుంచి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమర శంఖం పూరించేందుకు రాహుల్‌ సమాయత్తమయ్యారు! ప్రజా మద్దతును కూడగట్టేందుకు నడుం బిగించారు! అదే సమయంలో.. జనాదరణ గల బీజేపీ నేత యడ్యూరప్ప ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలగడం, ఇతర స్థానిక బీజేపీ నేతలు విశ్వసనీయత కోల్పోవడంతో ఆ పార్టీ ప్రధానంగా ప్రధాని మోదీ కరిష్మాపైనే ఆధారపడి ఎన్నికల పోరుకు సిద్ధమవుతోంది. ఫలితంగా కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోరు రాహుల్‌ వర్సెస్‌ మోదీ అన్నట్టు హోరాహోరీగా సాగేలా కనిపిస్తోంది! రాహుల్‌ గాంధీకి సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం.. దాని ఆధారంగా లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేయడంతో కాంగ్రెస్‌ పార్టీ దేశ రాజకీయాల్లో బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా మారేందుకు తగిన వాతావరణం ఇప్పటికే ఏర్పడిందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.

ఈ మేరకు.. ఏప్రిల్‌ 5 నుంచి కోలార్‌లో ‘సత్యమేవ జయతే’ పేరుతో ఉద్యమాన్ని రాహుల్‌ ప్రారంభిస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఇప్పటికే ప్రకటించారు. రాహుల్‌తో పాటు ప్రియాంక, ఇతర సీనియర్‌ నేతలు కూడా కర్ణాటకలో ఉధృతంగా ప్రచారం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. గత ఎన్నికల్లో మోదీ కర్ణాటకలో ఉధృతంగా ప్రచారం చేసి, యడ్యూరప్పను సీఎంగా చిత్రించినప్పటికీ బీజేపీ 104 సీట్లు మాత్రమే సాధించిందని.. ఇప్పుడు మోదీ ప్రభావం తగ్గడమే కాక, యడ్యూరప్ప సీఎం పదవిలో లేకపోవడం ఆ పార్టీకి నష్టం కలిగించే అంశాలని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్రకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని వాగ్దానం చేయడం ద్వారా ఈ నష్టాన్ని నివారించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఈ వర్గాలు అంటున్నాయి.

మూడు సిలు, రెండు ఎంలు

కర్ణాటక ఎన్నికల్లో మూడు సిలు అంటే కమ్యూనలిజం (మతతత్వం), క్యాస్ట్‌ (కులం), కరప్షన్‌ (అవినీతి)తో పాటు.. రెండు ఎంలు, అంటే మోదీ, మనీ (డబ్బు) ప్రధానంగా ప్రభావం చూపే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన సామాజిక వర్గాల మద్దతు ఏ పార్టీలకు ఉందో పరిశీలిస్తే.. లింగాయత్‌లలో 30 శాతం కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని, ఓబీసీలు, ఒక్కలిగల్లో మెజారిటీ కాంగ్రెస్‌ వైపే ఉన్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఎంబీ పాటిల్‌, ఈశ్వర్‌ కాంద్రే వంటి కాంగ్రెస్‌ నేతలు స్థానికంగా లింగాయత్‌లను ఆకర్షించేందుకు ప్రచారం ప్రారంభించారని చెప్పారు. అలాగే.. రాష్ట్రంలో అవినీతి ఎన్నికల్లో ప్రధానాంశంగా మారి ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీసిందని, ఏ పథకంలోనైనా 40 శాతం ముడుపులు చెల్లించాల్సి వస్తుందనే ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కోస్తా, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో మాత్రం.. మతతత్వం బీజేపీకి బాగా ఉపయోగపడే అవకాశాలున్నాయని వారు అంటున్నారు.

జగన్‌, కేసీఆర్‌ ప్రభావం?

ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఎంఐఎం నేత ఒవైసీ పాత్రనూ కాంగ్రెస్‌ నేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు. గాలి జనార్దన్‌ రెడ్డి స్థాపించిన ప్రాంతీయ పార్టీకే కాక అనేకమంది అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేసి బీజేపీ మెప్పు పొందేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ నేత ఒకరు చెప్పారు. ఈ మేరకు జగన్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసి ప్రతిపాదించారని ఆయన ఆరోపించారు. మరోవైపు.. జనతాదళ్‌ (సెక్యూలర్‌)కు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి ఆ పార్టీని బలోపేతం చేయడం ద్వారా కాంగ్రె్‌సకు నష్టం చేయాలని కేసీఆర్‌ అనుకుంటున్నారని.. కానీ, ఈ ఎన్నికల్లో జగన్‌, కేసీఆర్‌ ప్రభావం అంతగా ఉండదని, కర్ణాటక ప్రజలు బయటి శక్తులను తిరస్కరిస్తారని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ఒవైసీ ప్రభావం కూడా పెద్దగా ఉండదని.. ముస్లింల్లో అత్యధికులు కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపుతారని వారు భావిస్తున్నారు.

Updated Date - 2023-03-31T03:55:01+05:30 IST