Private schools: ఉత్తర్వులు ఉల్లంఘించి ప్రైవేటు పాఠశాలల ప్రారంభం

ABN , First Publish Date - 2023-06-02T07:57:39+05:30 IST

రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ఈ నెల ఏడున పాఠశాలలను పునఃప్రారంభించాలంటూ పాఠశాలల విద్యాశాఖ చేసిన

Private schools: ఉత్తర్వులు ఉల్లంఘించి ప్రైవేటు పాఠశాలల ప్రారంభం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ఈ నెల ఏడున పాఠశాలలను పునఃప్రారంభించాలంటూ పాఠశాలల విద్యాశాఖ చేసిన ఉత్తర్వులను కొన్ని ప్రైవేటు పాఠశాలలు(Private schools) ఉల్లఘించాయి. గురువారం ఉదయం నగరంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలను తెరవటంతో విద్యార్థులు హాజరయ్యారు. ముందుగా ఈ నెల ఒకటిన పాఠశాలలను పునః ప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత ఎండవేడి అధికం కావటంతో ఈ నెల ఏడువరకు పాఠశాలలకు ప్రభుత్వం సెలవు పొడిగించింది. ఆ మేరకు పాఠశాల విద్యాశాఖ ఈ నెల ఏడునే పాఠశాలలు పునః ప్రారంభించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నగరంలోని రామాపురం, తిరుమలైనగర్‌ తదితర ప్రాంతాల్లోన్ని కొన్ని ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కొన్ని పాఠశాలల నిర్వాహకులు విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సప్‌ సందేశాలు పంపి ఈ నెల ఒకటినే తమ పిల్లలను బడులకు పంపాలని ఆదేశించింది. అదే సమయంలో విద్యార్థుల ఫీజు కూడా చెల్లించాలని పేర్కొంది. దీంతో పాఠశాలలకు తమ పిల్లలను తల్లిదండ్రులు తీసుకెళ్ళారు. అంతేకాకుండా విద్యార్థులను యూనిఫామ్‌ లేకుండా తరగతులకు హాజరుకావాలని కూడా ఆదేశించారు. నగరంలోని ప్రైవేటు పాఠశాలలు తెరిచారనే సమాచారం అందుకున్న విద్యాశాఖ అధికారులు ఆ పాఠశాలల్లో తనిఖీ చేశారు. రామాపురంలోని ప్రైవేటు పాఠశాలకు వెళ్లిన విద్యాశాఖ అధికారులు ఎందుకు తెరిచారంటూ ప్రశ్నించగా తరగతులు ప్రారంభించలేదని, ప్రత్యేక పూజ కోసం విద్యార్థులను పిలిపించామని పేర్కొన్నారు. అయితే విద్యాశాఖ అధికారులు ఎట్టి పరిస్థితులలోనూ విద్యార్థులను పాఠశాలలకు రావాలని ఆదేశించకూడదని, పూజలకు కూడా రమ్మని ఒత్తిడి చేయకూడదని, పాఠశాలకు వచ్చిన పిల్లలను ఇళ్ళకు పంపివేయాలని ఆదేశించారు. ఆ మేరకు ఆ పాఠశాలకు వచ్చిన వారంతా ఇళ్ళకు వెళ్లారు..

కఠినచర్యలు తప్పవు...

ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లఘించి ఈ నెల ఏడో తేదీకి ముందే పాఠశాలలు తెరిచే ప్రైవేటు విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాలల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌(Minister Anbil Mahesh) హెచ్చరించారు. ఎండలు అధికంగా ఉండటం వల్లే ప్రభుత్వం ఈ నెల ఏడు వరకు పాఠశాలల సెలవు పొడిగించిందని తెలిపారు.

Updated Date - 2023-06-02T07:57:39+05:30 IST