Modi-Kishida: భారత్‌కు జపాన్ ప్రధాని... చైనాకు చెక్ పెట్టేందుకేనా?

ABN , First Publish Date - 2023-03-19T20:26:34+05:30 IST

భారత్ జపాన్‌ ప్రధానుల మధ్య జరగబోయే చర్చలపై చైనా ప్రత్యేక దృష్టి సారించింది.

Modi-Kishida: భారత్‌కు జపాన్ ప్రధాని... చైనాకు చెక్ పెట్టేందుకేనా?
Modi-Kishida

న్యూఢిల్లీ: భారత్‌కు G-20 అధ్యక్షత దక్కిన వేళ జపాన్ ప్రధాని ప్యూమియో కిషిదా(Japan PM Fumio Kishida) ఢిల్లీ వస్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన భారత్‌లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)తో ఢిల్లీలో ఆయన చర్చలు జరపనున్నారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. G-20 కూటమికి భారత్, G-7 కూటమికి జపాన్(Japan) అధ్యక్షత వహిస్తున్న తరుణంలో అంతర్జాతీయ పరిణామాలపై చర్చలు ఉండే అవకాశం ఉంది. మోదీతో కిషిదా చర్చల్లో ముఖ్యంగా రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, చైనా(China) దూకుడు వైఖరి తదితర అంశాలపై చర్చించేందుకు అవకాశం ఉంది. చైనా(China)ను కట్టడి చేసే విషయంపై లోతుగా చర్చించే అవకాశం ఉంది. సోమవారం కిషిదా ఢిల్లీలో కీలకోపన్యాసం చేస్తారు.

భారత్, జపాన్ మధ్య అనేక రంగాల్లో కీలక ఒప్పందాలున్నాయి. విద్య(Education), సైన్స్ అండ్ టెక్నాలజీ, రక్షణ(Defence), భద్రత(Security), ఆరోగ్యం(Healthcare), పెట్టుబడులు, వ్యాపార, వాణిజ్య రంగాల్లో అనేక ఒప్పందాలు కుదిరి అమల్లో ఉన్నాయి. కిషిదా పర్యటన నేపథ్యంలో రెండు దేశాల మధ్య మరిన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.

మరోవైపు భారత్ జపాన్‌ ప్రధానుల మధ్య జరగబోయే చర్చలపై చైనా ప్రత్యేక దృష్టి సారించింది. ఇద్దరు ప్రధానులూ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని చైనా నాయకత్వం ఆసక్తిగా గమనిస్తోంది.

Updated Date - 2023-03-19T21:13:57+05:30 IST