Share News

Premalatha: డీఎండీకే నేత ప్రేమలత సంచలన కామెంట్స్.. ఆ ఎమ్మెల్యేల ద్రోహం వల్లే కెప్టెన్‌కు అనారోగ్యం

ABN , Publish Date - Dec 17 , 2023 | 08:31 AM

తన భర్త, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ అనారోగ్యంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత

Premalatha: డీఎండీకే నేత ప్రేమలత సంచలన కామెంట్స్.. ఆ ఎమ్మెల్యేల ద్రోహం వల్లే కెప్టెన్‌కు అనారోగ్యం

- డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత సంచలన వ్యాఖ్యలు

- గాయాలతో రాటుదేలాం

- రోల్‌ మోడల్‌ జయలలిత అంటూ వ్యాఖ్య

చెన్నై, (ఆంధ్రజ్యోతి): తన భర్త, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ అనారోగ్యంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత(Premalatha) సంచలన వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్‌ అనారోగ్యానికి కారణం తమ పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్యేలే అని వ్యాఖ్యానించారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా విజయకాంత్‌ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేసిన నమ్మక ద్రోహం వల్లే ఆయన ఆరోగ్యం క్షీణించిందన్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తాజాగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఆమె శనివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్కిల్లో అన్నాడీఎంకే(AIADMK)తో తమ పార్టీ పొత్తు పెట్టుకుందన్నారు. అంతకుముందు జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో గణనీయమైన ఓట్ల శాతాన్ని దక్కించుకున్నామన్నారు. తొలుత 8.33 శాతం ఓట్లు, ఆ తర్వాత 10.35 శాతం ఓట్లు వచ్చాయని వెల్లడించారు. అయితే, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం వల్ల తక్కువ సీట్లలో పోటీ చేశామని, ఈ కారణంగా తక్కువ శాతం ఓట్లు వచ్చాయన్నారు. 2011 ఎన్నికల తర్వాత విజయకాంత్‌ శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారని, అలా ఎంపికైన మూడు నెలల్లోనే ఆయనకు అనేక ద్రోహాలు జరిగాయన్నారు.

ముఖ్యంగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల వెన్నుపోటు కారణంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారన్నారు. సాధారణంగా రాజకీయాల్లో గెలుపు మాత్రమే చర్చనీయాంశంగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. తమ పార్టీ స్థాపించి 19 యేళ్లు ఆయ్యాయని, ఇంతలోనే వందేళ్ల అనుభవం రాదన్నారు. తగిలిన ఎదురు దెబ్బలే మమ్మల్ని రాటుదేల్చాయన్నారు. అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా తన ఎంపిక అత్యవసరంగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు. ప్రజా సమస్య ఉన్న చోట తాను ప్రత్యక్షమవుతానని చెప్పారు. యేటా చెన్నై నగరంలో వరద ముప్పు ఏర్పడటానికి ప్రధాన కారణం.. వర్షపునీటిని సంరక్షించే వనరులు లేవని, ఈ కారణంగానే ముంపునకు గురవుతోందన్నారు. రాజకీయాల్లో తనకు రోల్‌ మోడల్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత అని, ఆమె ధైర్యసాహసాలు, ఆత్మ విశ్వాసం తనకు బాగా నచ్చుతాయన్నారు. రాజకీయాల్లో మహిళలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని, ఇందుకు మంచి ఉదాహరణ జయ అని ప్రేమలత పేర్కొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 08:31 AM