Power cut: అర్ధరాత్రి ఏంటిసార్ ఈ కరెంట్ కోతలు..
ABN , First Publish Date - 2023-05-17T11:52:01+05:30 IST
నగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీంతో నాలుగు ప్రాంతాలకు చెందిన ప్రజలు నాలుగు ప్రాంతాల్లో
అడయార్(చెన్నై): స్థానిక కొడుంగయూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిడ్కో నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీంతో నాలుగు ప్రాంతాలకు చెందిన ప్రజలు మంగళవారం నాలుగు ప్రాంతాల్లో ధర్నాలకు దిగారు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీనికితోడు ఉక్కపోత విపరీతంగా ఉంటోంది. ఇదే పరిస్థితి రాత్రిపూట కొనసాగుతోంది. దీంతో ఒక్క క్షణం కూడా ఫ్యాన్, ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి. అయితే, అర్ధరాత్రి పూట ఇష్టానుసారంగా అప్రకటిత విద్యుత్ కోతలు(Power cut) విధిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిడ్కో నగర్ ప్రాంతానికి చెందిన అనేక మంది ఈ కరెంట్ కోతలను ఖండిస్తూ మంగళవారం ధర్నాకు దిగారు. అదేవిధంగా ఎంకేబీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమవారం అర్ధరాత్రి కరెంట్ తీసేశారు. దీంతో ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు స్థానిక వ్యాసార్ పాడి శాస్త్రినగర్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తిరువిక, సేంబియం పోలీస్ స్టేషన్ పరిధి, ఒట్టేరి వెంకటేశ భక్తన్ వీధిలో కూడా అప్రకటిత విద్యుత్ కోతలు అమలు చేశారు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు.