Share News

Police: ఒంటిగంటలోపు వేడుకలు ముగించాల్సిందే..

ABN , Publish Date - Dec 31 , 2023 | 08:08 AM

రాజధాని నగరంలో న్యూ ఇయర్‌(New Year) వేడుకలను రాత్రి 1గంటలోపు ముగించాలని గ్రేటర్‌ చెన్నై పోలీసులు(Greater Chennai Police) తేల్చిచెప్పారు. 2024 కొత్త సంవత్సరం వేడుకల కోసం ఈవెంట్లు నిర్వహించే సంస్థలు ముందే అనుమతులు తీసుకోవాలని సూచించారు.

Police: ఒంటిగంటలోపు వేడుకలు ముగించాల్సిందే..

- నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

- పోలీసుల హెచ్చరిక

ప్యారీస్‌(చెన్నై): రాజధాని నగరంలో న్యూ ఇయర్‌(New Year) వేడుకలను రాత్రి 1గంటలోపు ముగించాలని గ్రేటర్‌ చెన్నై పోలీసులు(Greater Chennai Police) తేల్చిచెప్పారు. 2024 కొత్త సంవత్సరం వేడుకల కోసం ఈవెంట్లు నిర్వహించే సంస్థలు ముందే అనుమతులు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఈవెంట్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని నిర్దేశించారు. అలాగే, సెక్యూరిటీని తప్పనిసరిగా నియమించుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా ఈవెంట్లు నిర్వహించే ప్రాంతాల్లో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని, డీజే సౌండ్లు 45 డెసిబుల్‌ శబ్దం కంటే ఎక్కువ ఉండరాదని హెచ్చరికలు జారీ చేశారు.

భద్రత పటిష్ఠం... : సముద్రతీరాలు, ఆలయాలు, చర్చీలు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో పోలీసు భద్రతను పటిష్టం చేస్తున్నట్లు కమిషనర్‌ కార్యాలయం తెలిపింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి మైలాపూర్‌, కీల్పాక్కం, ట్రిప్లికేన్‌, టి.నగర్‌, అడయార్‌, సెయింట్‌ థామస్‌ మౌంట్‌, లిటిల్‌ మౌంట్‌, ఫ్లవర్‌ బజార్‌, వాషర్‌మెన్‌పేట, పులియాన్‌తోపు, అన్నానగర్‌, కొళత్తూర్‌, గిండి, నీలాంగరై, దురైపాక్కం, మధురవాయల్‌ బైపాస్‌ రోడ్డు, జీఎ్‌సటీ రోడ్డు తదితర ప్రాంతాల్లో బైక్‌ రేస్‌లు అడ్డుకొనేలా 25 పర్యవేక్షణ తనిఖీ బృందాలు ఏర్పాటయ్యాయి. నగరంలో ఉన్న 100 ప్రధాన ఆలయాలు, చర్చీలు, ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలకు భద్రత పటిష్ఠం చేశారు. ఆదివారం నుంచి సోమవారం వరకు ప్రజలు సముద్రంలో స్నానాలు చేయడాన్ని నిషేధించారు. మెరీనా బీచ్‌, శాంథోమ్‌, ఎలియట్స్‌, నీలాంగరై తదితర తీరప్రాంతాల్లో అశ్వ దళం పోలీసులు పర్యవేక్షించనున్నారు. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలను డ్రోన్‌ కెమెరాల ద్వారా పర్యవేక్షించే చర్యలు చేపట్టారు. రాష్ట్ర పోలీసు శాఖ, కోస్ట్‌గార్డ్‌ బలగాలు సంయుక్తంగా సముద్రతీరాల్లో గస్తీ చేపడతారు. ఈ ప్రాంతాల్లో అంబులెన్స్‌, అగ్నిమాపక వాహనాలను సిద్ధం చేశారు. అలాగే వాచ్‌ టవర్ల ద్వారా రద్దీలో దొంగతనాలకు పాల్పడే వారిని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని పర్యవేక్షించి అరెస్ట్‌ చేసే చర్యలు చేపట్టనున్నారు.

అనుమతి తప్పనిసరి... : వీధులు, నివాసప్రాంతాల్లో లౌడ్‌స్పీకర్లు, ఫ్లికరింగ్‌ లైట్లు ఏర్పాటుకు ముందుగానే ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్‌లలో అనుమతి పొందాల్సి ఉంటుంది.పోలీసుశాఖ విధించిన ఆంక్షలు ఉల్లంఘించకుండా ప్రజలు నూతనసంవత్సరం వేడుకలు ఉత్సాహంగాజరుపుకోవాలని, వాహనచోదకులు ప్రమాదాలకు తావులేకుండా వ్యవహరించాలని గ్రేటర్‌ చెన్నై పోలీసులు సూచించారు.

Updated Date - Dec 31 , 2023 | 08:08 AM