Share News

Pinarayi Vijayan: భారత్‌ను ఇజ్రాయెల్ ఆయుధంగా వాడుకుంటోంది.. కేరళ సీఎం పినరయి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-11-11T22:49:53+05:30 IST

Israel-Hamas War: కేరళ సీఎం పినరయి విజయన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనాకు సంఘీభావం తెలిపిన ఆయన.. భారత్‌ను ఇజ్రాయెల్ ఆయుధంగా వాడుకుంటోందని కుండబద్దలు కొట్టారు. ఇజ్రాయెల్ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాన్ని.. మన భారతదేశ వైఖరిగా పరిగణించొద్దని పేర్కొన్నారు.

Pinarayi Vijayan: భారత్‌ను ఇజ్రాయెల్ ఆయుధంగా వాడుకుంటోంది.. కేరళ సీఎం పినరయి సంచలన వ్యాఖ్యలు

కేరళ సీఎం పినరయి విజయన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనాకు సంఘీభావం తెలిపిన ఆయన.. భారత్‌ను ఇజ్రాయెల్ ఆయుధంగా వాడుకుంటోందని కుండబద్దలు కొట్టారు. ఇజ్రాయెల్ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాన్ని.. మన భారతదేశ వైఖరిగా పరిగణించొద్దని పేర్కొన్నారు. అంతేకాదు.. ఇజ్రాయెల్‌తో భారతదేశం సైనిక & రక్షణ ఒప్పందాలను నిలిపివేయాలని కూడా సూచించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

‘‘పాలస్తీనాకు మా సంఘీభావం తెలుపుతున్నాం. దయచేసి ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చే బీజేపీ విధానాన్ని భారతదేశ వైఖరిగా పరిగణించవద్దు. ఇజ్రాయెల్‌తో సైనిక, రక్షణ ఒప్పందాలను భారత్‌ నిలిపివేయాలి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ భారత్‌ను ఆయుధంగా ఉపయోగించుకుంటోంది’’ అని పినరయి విజయన్ పేర్కొన్నారు. అంతకుముందు కూడా.. అమెరికా మద్దతుతో పాలస్తీనాను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందని బాంబ్ పేల్చారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల కారణంగా పాలస్తీనా సోదరులు బాధపడుతున్నారని అన్నారు. గాజాలోని ప్రజలు మారణహోమం తరహా దురాక్రమణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వర్గం ప్రజలు నరమేధానికి గురవుతున్నప్పుడు తటస్థ వైఖరి అవలంభించలేమని.. పాలస్తీనా ప్రజలకు మనం సంఘీభావం తెలపాలని అన్నారు.


ఇదిలావుండగా.. నెల రోజుల పైనే అవుతున్నా హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్టోబరు 7న దక్షిణ ఇజ్రాయెల్‌లో హమాస్ ఆకస్మిక దాడి తర్వాత ఈ యుద్ధం ప్రారంభమవ్వగా.. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు తెగబడుతోంది. వైమానిక దాడులతో పాటు గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ.. హమాస్‌ని వెంటాడుతోంది. ఇప్పటి వరకు ఈ యుద్ధం కారణంగా గాజాలో మరణించిన వారి సంఖ్య 11 వేలు దాటింది. అదే సమయంలో.. హమాస్ దాడిలో 1,200 మందికి పైగా ఇజ్రాయిలీలు ప్రాణాలు కోల్పోయారు. నివేదికల ప్రకారం.. 200 మందికి పైగా బందీలు ఇంకా హమాస్ అదుపులో ఉన్నారు.

Updated Date - 2023-11-11T22:49:54+05:30 IST