Kejri on Liquor Scam: సాక్ష్యాలు లేవని కోర్టే చెప్పింది

ABN , First Publish Date - 2023-05-08T12:50:14+05:30 IST

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ స్కామ్ తప్పుడు కేసు అని, నిజాయితీ కలిగిన ఆమ్ ఆద్మీ పార్టీపై బురద చల్లేందుకు బీజేపీ సాగిస్తున్న నిరంతరం ప్రయత్నాలో ఇదొక భాగమని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ముడుపులు తీసుకున్నట్టు కానీ, మనీ లాండరింగ్ జరిగినట్టు కానీ సాక్ష్యాలు లేవని ఇప్పుడు కోర్టు కూడా చెప్పిందని తెలిపారు.

Kejri on Liquor Scam: సాక్ష్యాలు లేవని కోర్టే చెప్పింది

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ స్కామ్ (Liquor policy Scam) తప్పుడు కేసు అని, నిజాయితీ కలిగిన ఆమ్ ఆద్మీ పార్టీపై (AAP) బురద చల్లేందుకు బీజేపీ సాగిస్తున్న నిరంతరం ప్రయత్నాలో ఇదొక భాగమని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. ముడుపులు తీసుకున్నట్టు కానీ, మనీ లాండరింగ్ జరిగినట్టు కానీ సాక్ష్యాలు లేవని ఇప్పుడు కోర్టు కూడా చెప్పిందని తెలిపారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇద్దరు నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు ఆదివారంనాడు బెయిల్ మంజూరు చేసిన మరుసటి రోజే కేజ్రీవాల్ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు.

2021-22 ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయంటూ ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో నిందితులపై ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ ఈ కేసులో నిందితులైన రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ ''లిక్కర్ కుంభకోణం మొత్తం బోగస్. మొదట్నించీ ఈమాట మేము చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు కోర్టులు కూడా అదే మాట చెబుతున్నాయి. ఆప్ వంటి నిజాయితీ కలిగిన పార్టీపై నిరంతరం బురదచల్లే ప్రయత్నం బీజేపీ చేస్తోంది'' అని అన్నారు.

దీనిపై ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి మాట్లాడుతూ, ఢిల్లీ ఎక్సైజ్ కేసులో ఇద్దరు నిందితులపై సరైన సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేసినందుకు ఈడీని కోర్టు మందలించిందని, ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్‌ను అప్రతిష్టపాలు చేసి, దేశాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ క్షమాపణ చెప్పాలన్నారు. గత ఏడాదిగా, బీజీపీ సీనియర్ నేతలు, ప్రతినిధులు ఎక్సైజ్ పాలసీ కుంభకోణంపై ఎడతెరిపి లేకుండా ప్రెస్ మీట్‌లు పెడుతూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారని ఆమె అన్నారు. నెలల తరబడి న్యూస్ ఛానెల్స్‌లో ఆరోపణలు చేస్తూ రావడంతో సీబీఐ, ఈడీలు ఛార్జిషీట్లు దాఖలు చేశాయని చెప్పారు. లిక్కర్ వ్యాపారుల నుంచి 100 కోట్లు ముడుపులు అందాయని, ఆ సొమ్ములే గోవా ఎన్నికల్లో ఆప్ ఖర్చు చేసిందని ఈడీ ఆరోపణలు చేసిందన్నారు. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలను ఈడీ చూపించలేకపోయిందని కోర్టు స్పష్టంగా తెలియజేసిందని చెప్పారు.

బీజేపీ వాదన..

కాగా, ఆప్ వాదనను బీజేపీ కొట్టివేసింది. బెయిల్ ఆర్డర్‌ను ఆప్ నేతలు వక్రీకరిస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని, వారిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. అహేతుకమైన ప్రకటనల ద్వారా వరుస కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ ఆరోపించారు.

Updated Date - 2023-05-08T12:50:14+05:30 IST