Share News

BJP MP Ramesh Jagajinagi: మీరు దళితులైతే బీజేపీలో ఎదుగుదల ఉండదు.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-11-14T15:48:42+05:30 IST

Karnataka BJP: తాము అధికారంలోకి వస్తే.. దళితుల అభ్యున్నతి కోసం రకరకాల పథకాలు తీసుకొస్తామని, వారికి ఉన్నత పదవులు ఇస్తామంటూ రాజకీయ పార్టీలు చేసే హామీలు అన్నీ ఇన్నీ కావు. ‘ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మీ తలరాతలే మార్చేస్తాం’ అంటూ ప్రతిజ్ఞలు చేస్తారు.

BJP MP Ramesh Jagajinagi: మీరు దళితులైతే బీజేపీలో ఎదుగుదల ఉండదు.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

తాము అధికారంలోకి వస్తే.. దళితుల అభ్యున్నతి కోసం రకరకాల పథకాలు తీసుకొస్తామని, వారికి ఉన్నత పదవులు ఇస్తామంటూ రాజకీయ పార్టీలు చేసే హామీలు అన్నీ ఇన్నీ కావు. ‘ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మీ తలరాతలే మార్చేస్తాం’ అంటూ ప్రతిజ్ఞలు చేస్తారు. మరి.. రాజకీయ పార్టీలు వాటికి కట్టుబడి ఉంటున్నాయా? ఈ సంగతులేమో కానీ, కర్ణాటకకు చెందిన ఓ బీజేపీ ఎంపీ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు దళితులైతే, బీజేపీలో మీకెప్పుడూ ఎదుగుదల ఉండదంటూ స్వంత పార్టీపైనే బాంబ్ పేల్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.


ఆ బీజేపీ ఎంపీ పేరు రమేశ్ జగజినాగి. విజయపురలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మీరు దళితులైతే బీజేపీలో ఎదగడానికి అవకాశం ఉండదు. ఇతర ధనిక నాయకులు లేదా గౌడలు (వొక్కలిగాలు) ఉంటే.. ప్రజలు వారికే మద్దతు ఇస్తారు. కానీ దళితులుంటే మాత్రం ఎవరూ మద్దతు ఇవ్వరు. ఇది మాకు తెలుసు, ఇది చాలా దురదృష్టకరం’’ అని కుండబద్దలు కొట్టారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ హైకమాండ్ నియమించడం వల్లే ఆయన ఈ అసంతృప్తి వ్యక్తం చేశారు. దళితుల్ని పార్టీలో అస్సలు పట్టించుకోరన్న కోణంలో ఆయన మండిపడ్డారు.

ఇదే సమయంలో.. విజయేంద్రను పార్టీ అధ్యక్షుడిగా నియమించడంపై బీజేపీ హైకమాండ్‌పై కూడా జగజినాగి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘రాష్ట్రంలోని ఇతర పార్టీ నాయకులను కాదని, బీజేపీ హైకమాండ్ విజయేంద్రను పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. యడ్యూరప్ప తనయుడు కావడం వల్లే పార్టీ హైకమాండ్ ఆయన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది’’ అని ఆయన విమర్శించారు. పార్టీలోని ఇతర రాజకీయ నాయకులకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. దీంతో.. కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో వివాదం చెలరేగింది. స్వంత పార్టీపైనే ఓ ఎంపీ ఇలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి.

ఇదిలావుండగా.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యఢ్యూరప్ప, కుమారుడు, శిఖరిపుర ఎమ్మెల్యే అయిన బీవై విజయేంద్ర నవంబర్ 15వ తేదీన కర్ణాటక బీజేపీ యూనిట్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంతకుముందు నళిన్ కుమార్ ఈ బాధ్యతలు చేపట్టగా, ఆయన స్థానంలో విజయేంద్ర నియమితులయ్యారు. కర్ణాటకలు ఎన్నికలు జరిగిన దాదాపు ఆరు నెలల తర్వాత బీజేపీ ఆ రాష్ట్ర అధ్యక్షుడ్ని ఎంపిక చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నవంబర్ 10వ తేదీన కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బీవై విజయేంద్రను నియమించారు.

Updated Date - 2023-11-14T15:48:43+05:30 IST