new income tax: కొత్త ఆదాయ పన్నులో స్వల్ప ఊరట

ABN , First Publish Date - 2023-03-25T06:05:10+05:30 IST

గత నెలలో ప్రవేశ పెట్టిన 2023-24 కేంద్ర వార్షిక బడ్జెట్‌లో పేర్కొన్న కొత్త ఆదాయపు పన్నులో సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం లోక్‌సభలో ఆర్థిక బిల్లు-2023ను ప్రవేశపెట్టారు.

new income tax: కొత్త ఆదాయ పన్నులో స్వల్ప ఊరట

ఆర్థిక బిల్లు-23కి 64 సవరణలు.. ఆమోదించిన సభ

న్యూఢిల్లీ: గత నెలలో ప్రవేశ పెట్టిన 2023-24 కేంద్ర వార్షిక బడ్జెట్‌లో పేర్కొన్న కొత్త ఆదాయపు పన్నులో సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం లోక్‌సభలో ఆర్థిక బిల్లు-2023ను ప్రవేశపెట్టారు. 64 సవరణలతో కూడిన ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. అయితే, అదానీ వ్యవహారంపై అధికార, విపక్ష సభ్యుల నినాదాలతో సభ హోరెత్తుతున్న సమయంలోనే దీనిని ఆమోదిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఇక, ఈ సవరణ బిల్లు ప్రకారం.. రూ.7 లక్షలకు మించి స్వల్పంగా ఆదాయం పెరిగినప్పటికీ.. పన్ను ఊరట కల్పించే అవకాశాలను ప్రతిపాదించినట్టు మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. వాస్తవానికి నూతన పన్ను విధానంలో రూ.7లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, రూ.7లక్షలకు మించితే పన్ను విధిస్తారు. ఉదాహరణకు వార్షిక ఆదాయం రూ.7,00,100 ఉన్న వ్యక్తులు.. పైన పెరిగిన రూ.100కారణంగా రూ.25,010 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో దీనిని సాధ్యమైనంత తగ్గించేలా కొత్త విధానాన్ని ఫైనాన్స్‌ బిల్లులో ప్రతిపాదించారు. ఇదే విషయాన్ని నిర్మల సభకు వివరించారు. అయితే, ఎంత తగ్గించారనే విషయాన్ని మాత్రం ఆమె వివరించలేదు. దీనికి సంబంధించి నాంగియా ఆండర్సన్‌ ఎల్‌ఎల్‌పీ పార్టనర్‌ సందీప్‌ ఝంఝన్‌వాలా మాట్లాడుతూ.. వ్యక్తిగత వార్షిక ఆదాయం రూ.7,27,700 పొందుతున్న వారికి ఉపశమనం కలుగుతుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదిలావుంటే, 2023-24 బడ్జెట్‌లో వార్షిక ఆదాయం రూ.7 లక్షలు ఉన్నప్పటికీ కొత్త పన్ను విధానంలో ఎలాంటి పన్నులూ విధించరు. ఇది పన్ను చెల్లింపుదారులకు ఒకరకంగా సానుకూల పరిణామమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త పన్ను విధానం మేరకు.. రూ.3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదు. రూ.3-6 లక్షల వరకు 5శాతం, రూ.6-9 లక్షల వరకు 10శాతం, రూ.9-12 లక్షల వరకు 15శాతం, రూ.12-15 లక్షల వరకు 20శాతం, రూ.15 లక్షలకు పైన ఆదాయంపై 30శాతం వరకు పన్ను ఉంటుంది.

Updated Date - 2023-03-25T06:14:15+05:30 IST