Jagdeep Dhankar: దానికి ఏదైనా మందు ఉందా?.. రాహుల్‌కు ఉపరాష్ట్రపతి స్ట్రాంగ్ కౌంటర్!

ABN , First Publish Date - 2023-03-11T19:09:42+05:30 IST

పార్లమెంటు ప్రతిష్ట పునరుద్ధరణకు ఏదైనా మెడిసన్ ఉందా? అని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్..

Jagdeep Dhankar: దానికి ఏదైనా మందు ఉందా?.. రాహుల్‌కు ఉపరాష్ట్రపతి స్ట్రాంగ్ కౌంటర్!

న్యూఢిల్లీ: పార్లమెంటు ప్రతిష్ట పునరుద్ధరణకు ఏదైనా మెడిసన్ ఉందా? అని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankar) కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని పరోక్షంగా ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో శనివారంనాడు జరిగిన ఆయుర్వేద ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, పార్లమెంటులో కొన్ని మైక్రోఫోన్లను స్వి్చాఫ్ చేస్తున్నారనడం పూర్తిగా అవాస్తవమని చెప్పారు. కొందరు వ్యక్తులు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోని పార్లమెంటులో మైకులు పనిచేయవంటూ మాట్లాడుతున్నారని, ఇంతకంటే అసత్యం మరొకటి ఉండదని రాహుల్‌ పేరును నేరుగా ప్రస్తావించకుండా ధన్‌ఖడ్ అన్నారు.

ఇటీవల లండన్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లోని గ్రాండ్‌ కమిటీ రూంలో భారత్‌ సంతతికి చెందిన ప్రతిపక్ష లేబర్‌ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాహుల్‌ మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం పార్లమెంటులో విపక్షాల గొంతు నొక్కేస్తోందని ఆరోపించారు. ''మా మైకులు పనిచేయవా అంటే చేస్తాయి. అవి అవుట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ కాదు. కానీ వాటిని స్విచాన్‌ చేయలేం. నేను మాట్లాడేటప్పుడు ఈ అనుభవం నాకు చాలాసార్లే ఎదురైంది'' అని తెలిపారు. నోట్ల రద్దు, జీఎస్టీ, చైనా సైన్యం చొరబాటు ఇలా అనేక అంశాలపై పార్లమెంటులో మాట్లాడడానికి తమను అనుమతించలేదని చెప్పారు. లోతైన చర్చలు జరిగే వేదికగా పార్లమెంటు తనకు గుర్తుందని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. భారతదేశానికి చెందిన ఓ నాయకుడు కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వచ్చి మాట్లాడగలడని, కానీ భారత్‌లోనే ఓ యూనివర్సిటీలో మాత్రం మాట్లాడలేడని అన్నారు.

కాగా, రాహుల్ గాంధీ భారతదేశ ప్రతిష్టను విదేశాల్లో దెబ్బతీసేలా మాట్లాడారంటూ పలువురు బీజేపీ నేతలు విమర్శలు సంధించగా, ఉపరాష్ట్రపతి సైతం తాజాగా విరుచుకుపడ్డారు.''రాజ్యసభ చైర్మన్‌గా ఒక మాట చెప్పదలచుకున్నాను. మీరు ఓ మందు (Medicine) కనిపెట్టండి. దానివల్ల పార్లమెంటు ప్రతిష్ట పునరుద్ధరణ జరుగుతుంది'' అని కార్యక్రమంలో పాల్గొన్న యోగాగురు రాందేవ్ బాబా సహచరుడైన పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణను కోరారు. పార్లమెంటు, లెజిస్లేటివ్ అసెంబ్లీల నిర్వహణ అసాధారణమైనవని, వాటికి ఎలాంటి అవాంతరాలు ఉండరాదని ధన్‌ఖడ్ అన్నారు.

Updated Date - 2023-03-11T19:09:42+05:30 IST