Nagapattinam to Sri Lanka: త్వరలో.. నాగపట్టినం నుంచి లంకకు నౌకాయానం
ABN , First Publish Date - 2023-10-07T10:40:44+05:30 IST
నాగపట్టినం(Nagapattinam) నుంచి త్వరలో శ్రీలంక(Sri Lanka)కు నౌకాయానం కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి.
- ట్రయల్ రన్ కోసం కొచ్చిన్ నౌక
చెన్నై, (ఆంధ్రజ్యోతి): నాగపట్టినం(Nagapattinam) నుంచి త్వరలో శ్రీలంక(Sri Lanka)కు నౌకాయానం కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఓడరేవు నుంచిశ్రీలంకకు ప్రయాణికుల నౌకాయానం ప్రారంభించే దిశగా ట్రయల్ రన్ నిర్వహించడానికి కేరళలోని కొచ్చిన్ నుంచి ఓ నౌక బయలుదేరింది. ఇటీవలఢిల్లీలో భారత్-శ్రీలంక దేశాల నడుమ జరిగిన సుహృద్భావ చర్చల్లో ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) పాల్గొని నాగపట్టినం నుంచి శ్రీలంకకు ప్రయాణికుల నౌకను నడపనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు ప్రయాణికుల నౌకను నడిపేందుకు వీలుగా తగినన్ని నిధులు కూడా మంజూరు చేయడంతో నాగపట్టినం ఓడరేవులో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఓడరేవు టెర్మినల్ అందంగా తీర్చిదిద్దే పనులు చురుగ్గాసాగుతున్నాయి. ఈపనులు వారం రోజుల్లోపున పూర్తవుతాయని అధికారులు తెలిపారు. నాగపట్టినం నుంచి రెండు ప్రయాణికుల నౌకలను శ్రీలంకకు నడిపేందుకు అధికారులు తగు సన్నాహాలు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన పనులు 90శాతం వరకూ పూర్తయ్యాయి. ప్రస్తుతం నాగపట్టినం నుంచి శ్రీలంకకు నౌకలో ప్రయాణించేందుకు అయ్యే చార్జీని అధికారులు నిర్ణయించాల్సి ఉంది. నాగపట్టినం నుండి శ్రీలంక(Nagapattinam to Sri Lanka)కు నౌకాయానం కోసం ఇప్పటికే కేరళలోని కొచ్చిన్ నుంచి ఓ నౌక బయలుదేరింది. ఆనౌక శ్రీలంకమీదుగా శనివారం సాయంత్రం లేదా, ఆదివారం వేకువజామున నాగపట్టినం ఓడరేవుకు చేరుకుంటుంది. ఆ నౌకతో ఓడరేవు అధికారులు శ్రీలంకకు ట్రయల్ రన్ జరిపేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఆ ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత ఈ నౌకాయానం తేదీలు ప్రకటించనున్నారు.