Pandit Funeral: కశ్మీర్ పండిట్ అంత్యక్రియలకు అన్నీ తామైన ముస్లింలు...
ABN , First Publish Date - 2023-02-28T17:54:12+05:30 IST
పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న కశ్మీర్ పండింట్ బ్యాంక్ గార్డు సంజయ్ కుమార్ అంత్యక్రియలకు..
శ్రీనగర్: పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న కశ్మీర్ పండింట్ బ్యాంక్ గార్డు సంజయ్ కుమార్ (Sanjay Kumar) అంత్యక్రియలకు (Funerals) ఇరుగుపొరుగు ముస్లింలు (Muslims) పెద్దఎత్తున తరలి వచ్చారు. ఏళ్ల తరబడి తమతోనే కలిసిమెలిసి తిరిగిన పండిట్‌కు కన్నీటి వీడ్కోలు చెప్పారు. అచాన్ గ్రామంలో ఉన్న ఏకైక పండిట్ కుటుంబం కూడా సంజయ్ కుమార్ కుటుంబమే కావడంతో, అతని ముస్లిం మిత్రులు స్వయంగా ముందుకు వచ్చి పండిట్ అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకూ అవసరమైన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు.
''సంజయ్ మాలో ఒకడు. అతను పండిట్ అనే ఆలోచనే మాకు ఎప్పుడూ లేదు'' అని పండిట్ మిత్రుడు ముదసిర్ అహ్మద్ తెలిపాడు. పండిట్ పార్థివదేహాన్ని ముదసిర్ స్వయంగా మోయడంతో పాటు అంత్యక్రియలకు అవసరమైన కట్టెలను కూడా సమకూర్చాడు. మిత్రత్వం, సోదరభావం జీవితకాలం ఉంటుందని, తరతరాలుగా తామంతా ఇదే బాంధవ్యాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నామని అహ్మద్ చెప్పాడు. పండిట్ హత్యకు గురైన విషాద వార్త తెలిసిన వెంటనే తామంతా అతని ఇంటికి వెళ్లి కుంటుంబ సభ్యులను ఓదార్చామని, అన్ని రకాల సాయం అందించామని చెప్పారు.
సంజయ్ బంధువులు కూడా తమకు ముస్లిం సోదరులతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముస్లిం సోదరులు ముందుండే వారని, తమ మత పరమైన వ్యవహారాల్లో మాత్రం దూరంగానే ఉండే వారని చెప్పారు. తమ పురోహితుడు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియులు నిర్వహిస్తుంటే వారు (ముస్లింలు) కొద్ది దూరంగా ఉండి చూశారని, అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లను మాత్రం స్వయంగా వారే చూసుకున్నారని తెలిపారు.
నలభై ఏళ్ల సంజయ్‌ను ఉగ్రవాదులు గత ఆదివారం పొట్టనపెట్టుకున్నారు. సరుకులు కొనుగోలు చేసేందుకు తన ఇంటికి దగ్గర్లో ఉన్న కిరణా దుకాణానికి వెళ్తుండగా ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరిపారు. దాంటో సంజయ్ అక్కడికక్కడే కన్నుమూశాడు. ఈ ఏడాదిలో ఉగ్రవాదుల మొదటి లక్షిత హత్య ఇది. సంజయ్‌కు భార్య, ఒక సోదరుడు ఉన్నారు. సంజయ్ అంత్యక్రియల సందర్భంగా జమ్మూకశ్మీర్ ఏడీజీపీ పుల్వామాలో పర్యటించి భద్రతా పరిస్థితిని సమీక్షించారు. కౌంటర్ ఇన్‌సర్జెన్సీ, నిఘా చర్యలను మరింత పెంచాలని పోలీసులు, పారామిలటరీ బలగాలకు ఆయన ఆదేశాలిచ్చారు.