Share News

Sanjay Raut: మోహన్ భగవత్ జీ.. 'ఇండియా' కూటమికి మద్దతివ్వండి..!

ABN , First Publish Date - 2023-10-24T15:15:11+05:30 IST

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాలంటే 'ఇండియా' కూటమికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) చీఫ్ మోహన్ భగవత్ సపోర్ట్ చేయాలని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు. ఈరోజు ప్రజాస్యామ్యం ప్రమాందలో పడిందని పేర్కొన్నారు.

Sanjay Raut: మోహన్ భగవత్ జీ.. 'ఇండియా' కూటమికి మద్దతివ్వండి..!

ముంబై: దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాలంటే 'ఇండియా' (I.N.D.I.A.) కూటమికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) సపోర్ట్ చేయాలని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. ఇండియా ముందుకు వెళ్లకూడదని కోరుకునే వ్యక్తులు కొందరు ప్రపంచంలోనూ, ఇండియాలోనూ ఉన్నారని నాగపూర్‌లో జరిగిన 'విజయదశమి ఉత్సవ్'లో భగవత్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సంజయ్ రౌత్ తాజా సూచన చేశారు.


మోహన్ భగవత్ వ్యాఖ్యలు విపక్షాలను ఉద్దేశించి చేసి ఉంటే, ఆయన ముందుగా ఇండియా బ్లాక్‌లో చేరాలని, ఎందుకంటే ఇవాళ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని రౌత్ అన్నారు. భిన్న సిద్ధాంతాలున్న వ్యక్తులు ఇండియా కూటమిగా ఏర్పడి నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమైనప్పుడు మోహన్ భగవత్ సైతం దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాండేందుకు ఇండియా కూటమికి మద్దతివ్వాలన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి (Emergency) ఏర్పడినప్పుడు సంఘ్ నేతలు జైలులో ఉన్నారని, అంతా కలిసి అభిప్రాయాలు పంచుకుని ఆ తర్వాత జనతా పార్టీ ఏర్పాటు చేసుకుని నియంతృత్వానికి చరమగీతం పాడారని అన్నారు. "మీకు తెలియకపోతే అప్పట్లో జైలులో ఉన్న లాల్‌ కృష్ణ అడ్వాణి ఇంకా మనమధ్యే ఉన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి సైతం జైలుకు వెళ్లారు. జయప్రకాష్ నారాయణ్‌తో సహా అనేక మంది తమతమ అభిప్రాయాలు పంచుకున్నారు. మోహన్ భగవత్‌కు ఈ విషయాలు చెప్పాల్సి రావడం ఈ దేశ దురదృష్టం'' అని రౌత్ అన్నారు.


మణిపూర్ అంశాన్ని మోహన్ భగవత్ ప్రస్తావించడంపై రౌత్ మాట్లాడుతూ, లద్దాఖ్‌లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోవడంపై 'ఇండియా' కూటమి తరచు ప్రశ్నిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. మణిపూర్ గురించి మీరు (మోహన్ భగవత్) మాట్లాడేటప్పుడు లద్దాఖ్ గురించి కూడా మాట్లాడాలని, ఈరోజు దసరా అని, పవిత్రమైన రోజని, ప్రతి ఒక్కరూ నిజం మాట్లాడాలని అన్నారు.

Updated Date - 2023-10-24T15:15:11+05:30 IST