Minister M Subramaniam: ఈ మంత్రి ఎంత మంచోడో చూడండి.. మిగతా వారు కూడా ఇలాగే ఉంటే..
ABN , First Publish Date - 2023-03-15T12:09:47+05:30 IST
రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) ఉదారతను చాటుకుంటున్నారు. స్థానిక చేపాక్ ఎమ్మెల్యేల క్వార్టర్స్‌లో త
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) ఉదారతను చాటుకుంటున్నారు. స్థానిక చేపాక్ ఎమ్మెల్యేల క్వార్టర్స్‌లో తనకు కేటాయించిన ఫ్లాట్‌లో వివిధ ప్రాంతాల నుండి వచ్చే రోగుల కుటుంబ సభ్యులకు, వారి సహాయకులకు బస సదుపాయం కల్పిస్తున్నారు. ఎమ్మెల్యేలకు చేపాక్ క్వార్టర్స్‌లో కేటాయించే ప్రతి ఫ్లాట్‌లో హాలు, పడకగది, వంటగది, డైనింగ్ హాలు, స్నానపు గది అంటూ ఓ చిన్న కుటుంబం బస చేసేందుకు అనువుగా ఉంటుంది. ఈ ఫ్లాట్లలో ఎమ్మెల్యేలు చాలామంది తమ నియోజకవర్గం నుంచి వచ్చే ప్రజలు బసచేసి వెళ్ళడానికి అనుమతిస్తుంటారు. 25 శాతం మంది శాసనసభ్యులు మాత్రమే ఆ క్వార్టర్స్‌లో బసచేస్తుంటారు. అయితే మంత్రి సుబ్రమణ్యంకు ఎమ్మెల్యే క్వార్టర్స్(MLA QUARTERS)లో కేటాయించిన ఫ్లాట్‌ను మాత్రం రోగులతోపాటు వచ్చేవారి బస కోసం వినియోగిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం తెన్‌కాశికి చెందిన ఓ బాలిక వింత వ్యాధితో బాధపడుతూ ఎగ్మూరు ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆ బాలిక తల్లిదండ్రులు ఆరు నెలలపాటు సుబ్రమణ్యం ఫ్లాట్‌లో బసచేశారు. వారి కోసం ప్రతి నెలా ఆయన కిరాణా సరకులను అక్కడికి పంపేవారు. అదే విధంగా కృష్ణగిరికి(Krishnagiri) చెందిన పదేళ్ళ సూర్యకుమార్ ఒంటి నిండా గాయాలతో చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అతడికి మంత్రి సుబ్రమణ్యం ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించారు. ఆ బాలుడి తల్లిదండ్రులు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనే బసచేశారు. వారికి మంత్రి సుబ్రమణ్యం ఆరుమాసాలపాటు తన సొంత ఖర్చులతో సదుపాయాలు కల్పించారు. ఏడాదికి పైగా ఆశ్రయం పొందిన సూర్యకుమార్, అతడి తల్లిదండ్రులు మంత్రికి ధన్యవాదాలు తెలుపుకుని ఇటీవలే స్వస్థలానికి వెళ్లారు. ఇక మారథాన్ క్రీడాకారుడిగా ఉన్న మంత్రి సుబ్రమణ్యం ఇటీవల చెన్నైలో మాజీ మంత్రి కరుణ పేరిట మారథాన్ పోటీల నిర్వహణ ద్వారా వచ్చిన కోటి రూపాయలను ఎగ్మూరు చిల్డ్రన్స్ హాస్పిటల్ అభివృద్ధి కోసం విరాళంగా ఇచ్చారు.
