Minister: 15 ఏళ్లలో 1,705 మంది అవయవదానం
ABN , First Publish Date - 2023-08-02T07:33:50+05:30 IST
రాష్ట్రంలో గత 15 ఏళ్లలో 1,705 మంది అవయవదానం చేసినట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) ప్రకటిం
పెరంబూర్(చెన్నై): రాష్ట్రంలో గత 15 ఏళ్లలో 1,705 మంది అవయవదానం చేసినట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) ప్రకటించారు. నగరంలో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... కలైంజర్ కరుణానిధి ప్రభుత్వ హయాంలో 2008 సెప్టెంబరు 5వ తేది రాష్ట్రప్రభుత్వం మెదడు నిర్జీవం - అవయవ మార్పిడి పథకం ప్రారంభించగా, 2015లో తమిళనాడు ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కాలేయం మార్పిడి శస్త్రచికిత్స స్టాన్లీ ప్రభుత్వాసుత్రిలో బాగా పనిచేస్తోందన్నారు. ఈ ఏడాది రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కాలేయ మార్చిడి శస్త్రచికిత్స విభాగం ఏర్పాటు చేయనున్నామని, అనంతరం తిరునల్వేలి, మదురై, కోయంబత్తూర్(Tirunelveli, Madurai, Coimbatore)లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రుల్లో ఈ విభాగాలు ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కమిషన్ ప్రారంభించిన 15 ఏళ్లలో 1,705 మంది అవయవదానం చేశారని తెలిపారు.
అందులో గుండె-786, ఊపిరితిత్తులు-801, కాలేయం-1,565, కిడ్నీ-3,046, క్లోమం-37, చిన్న పేగు-6, ఉదర భాగాలు-2, చేతులు-4 వంటి అవయవాలు దానం చేయగా 6,247 మందికి అమర్చామన్నారు. ఇవి కాకుండా 2,500 మంది కళ్లు దానం చేశారని తెలిపారు. రాష్ట్రంలో మాత్రమే ముఖ్యమంత్రి(Chief Minister) సమగ్ర వైద్య బీమా పథకం కింద రూ.22 లక్షల వరకు అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు అందిస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా 2014 నుంచి ఇప్పటివరకు 370 మంది అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకొని లబ్ధిపొందారని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా 2021 ఆగస్టు 13వ తేది నుంచి రోగుల నమోదు, అవయవాల కేటాయింపుకు ‘విడియల్’ అనే వెబ్‌సైట్, యాప్ ప్రారంభించామన్నారు. ఈ యాప్ ద్వారా నమోదు చేసుకున్న వారికి సీనియారిటీ ఆధారంగా అవయవాలు కేటాయిస్తున్నామని మంత్రి సుబ్రమణ్యం తెలిపారు.