Metro Railway Station: మెట్రో రైల్వేస్టేషన్ల చుట్టుపక్కల వారికి ఓ గుడ్ న్యూస్..

ABN , First Publish Date - 2023-05-18T13:22:37+05:30 IST

మీరు మెట్రో రైల్వేస్టేషన్ల చుట్టుపక్కల నివశిస్తున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్.. అదేమిటంటే..

Metro Railway Station: మెట్రో రైల్వేస్టేషన్ల చుట్టుపక్కల వారికి ఓ గుడ్ న్యూస్..

పెరంబూర్‌(చెన్నై): చెన్నై మెట్రో రైల్వేస్టేషన్ల చుట్టుపక్కల ఉన్న వారు ఉచితంగా ప్రయాణించేలా ‘ప్రమోషనల్‌ టిక్కెట్స్‌’ విధానం త్వరలో అమలు చేయనున్నట్లు చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (Chennai Metrorail Limited) మేనేజింగ్‌ డైరెక్టర్‌ సిద్ధిక్‌ తెలిపారు. వాట్సాప్‌ ద్వారా మెట్రో రైలు టిక్కెట్లు పొందే సౌకర్యం బుధవారం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా జీఎం సిద్ధిక్‌ మాట్లాడుతూ... మెట్రోరైలు ప్రయాణికులకు పలు రాయితీలు అందిస్తున్నామని, వాటిలో ఒక భాగంగా వాట్సాప్‌ ద్వారా టిక్కెట్లు పొందే వసతి కల్పించామన్నారు. అలాగే, పేటీఎం, ఎయిర్‌టెల్‌ సంస్థ యాప్‌ ద్వారా టిక్కెట్లు పొందే సౌకర్యం కల్పించనున్నామన్నారు. వాట్సాప్‌ ద్వారా పొందే టిక్కెట్లు రోజంతా పనిచేస్తాయని, కానీ, ఒకసారి ఆ టిక్కెట్టుతో ప్రయాణం చేస్తే, తదుపరి రెండు గంటల్లో టికెట్టు కాలపరిమితి ముగుస్తుందన్నారు. ఒకవేళ సర్వర్‌ సమస్య కారణంగా టిక్కెట్లు పొందలేకపోతే నగదు తిరిగి అందిస్తామని తెలిపారు. వాట్సాప్‌ ద్వారా ఒకేసారి ఏడు టిక్కెట్లు పొందవచ్చన్నారు. మెట్రో రైల్వేస్టేషన్ల సమీపంలోని 5 కి.మీలోపు నివసించే వారికి నిర్ణీత రోజుల్లో ఉచితంగాను, రాయితీతో ప్రయాణించేలా ప్రమోషన్‌ టిక్కెట్లు అందజేయాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం మెట్రో రైళ్లు నాలుగు బోగీలతో నడుస్తున్నాయని, మరో రెండు బోగీలు జత చేసేందుకు ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పట్టే అవకాశముందని తెలిపారు. అందుకు సుమారు రూ.4 వేల కోట్లు అవసరమవుతుందన్నారు. మెట్రోరైళ్లలో ప్రయాణికుల సంఖ్యతో పాటు ఆదాయం పెరిగిందన్నారు. అదే సమయంలో ఆరు నెలలుగా విద్యుత్‌ బిల్లులు 40 శాతం పెరడంతో, ఆదాయం, ఖర్చులు సమానంగా ఉన్నాయన్నారు. కోవై, మదురైలో మెట్రో ప్రాజెక్ట్‌ ప్రణాళిక తయారీ పనులు చేపట్టామన్నారు. స్థానిక విమానాశ్రయం నుంచి కిలాంబాక్కం వరకు పొడిగింపు పనులు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే ప్రారంభిస్తామని సిద్ధిక్‌ తెలిపారు.

Updated Date - 2023-05-18T13:22:37+05:30 IST