Manipur : మణిపూర్ యువతపై మద్యం ప్రభావం : ‘ఉక్కు మహిళ’ ఇరోమ్ షర్మిల

ABN , First Publish Date - 2023-07-23T09:42:48+05:30 IST

మణిపూర్‌లో మే 3 నుంచి జరుగుతున్న హింసాకాండపై ‘ఉక్కు మహిళ’ ఇరోమ్ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి విజ్ఞప్తి చేశారు. యువతపై మద్యం విపరీత ప్రభావం చూపుతోందని, గృహహింసకు దీనికి సంబంధం ఉందని తెలిపారు.

Manipur : మణిపూర్ యువతపై మద్యం ప్రభావం : ‘ఉక్కు మహిళ’ ఇరోమ్ షర్మిల
Iron Lady of Manipur Irom Sharmila

న్యూఢిల్లీ : మణిపూర్‌లో మే 3 నుంచి జరుగుతున్న హింసాకాండపై ‘ఉక్కు మహిళ’ ఇరోమ్ షర్మిల (Irom Sharmila) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి విజ్ఞప్తి చేశారు. స్థానిక పరిస్థితుల గురించి మాట్లాడుతూ, యువతపై మద్యం విపరీత ప్రభావం చూపుతోందని, గృహహింసకు దీనికి సంబంధం ఉందని తెలిపారు.

ఓ న్యూస్ ఛానల్‌తో ఇరోమ్ షర్మిల మాట్లాడుతూ, యువత విషయంలో స్థానిక మద్యం ప్రభావం విపరీతంగా ఉందన్నారు. మద్యం మత్తులో పురుషులు మహిళలపై హింసాత్మకంగా ప్రవర్తిస్తుండటం మరొక సమస్య అని చెప్పారు. మే 3 నుంచి హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్ పరిస్థితిని చక్కదిద్దాలని ప్రధాని మోదీని కోరారు. ఘర్షణలు, లైంగిక దాడులను నివారించడానికి సరైన వైఖరిని ప్రదర్శించాలని కోరారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలతో మోదీ మాట్లాడాలని, తీవ్రంగా వేధిస్తున్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలని, శాంతిని పునరుద్ధరించేందుకు కృషి చేయాలని అన్నారు.

జీతాల్లో కొంత లాక్కుంటున్న మిలిటెంట్లు

మణిపూర్ ఫెడరల్ స్టేట్ స్టేటస్ గురించి నొక్కి వక్కాణిస్తూ, మెయిటీ, కుకీ కమ్యూనిటీల మధ్య ఘర్షణలు నియంత్రించడానికి వీల్లేని స్థాయికి చేరుకున్నాయన్నారు. ఉద్యోగులకు ప్రతి నెలా సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదని, మరోవైపు ఉద్యోగుల జీతాల్లో కొంత శాతం సొమ్మును మిలిటెంట్లు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రజల మనసులు ప్రశాంతంగా లేవన్నారు.

పొరుగు రాష్ట్రాల జోక్యం వద్దు

ఇరుగు, పొరుగు రాష్ట్రాలు మణిపూర్ పరిస్థితిలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దని, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడంలో భాగస్వాములు కావాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మణిపూర్ పరిస్థితిని పట్టించుకోకుండా వదిలేసిందని అభిప్రాయపడ్డారు. కేంద్రం సకాలంలో, సరైన రీతిలో స్పందించాలన్నారు.

మానవ హక్కుల ఉద్యమకారిణి

ఇరోమ్ షర్మిల మణిపూర్ మానవ హక్కుల ఉద్యమకారిణి. ఆమె 16 ఏళ్లపాటు సుదీర్ఘంగా నిరాహార దీక్ష చేశారు. హింస, అణచివేతలకు వ్యతిరేకంగా ఆమె ఈ ఉద్యమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం తన స్వరాష్ట్రం తగులబడుతుండటాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం చేసి, నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన గుండె పగిలిపోయిందని చెప్పారు. ఇలాంటి క్రూరత్వాన్ని క్షమించకూడదని తెలిపారు. లోతుగా పాతుకుపోయిన సమస్యలను పరిష్కరించవలసిన సమయం వచ్చిందని తెలిపారు.

ఎందుకు ఈ ఘర్షణలు?

మెయిటీ తెగవారికి షెడ్యూల్డు తెగల హోదాను ఇవ్వడంపై పరిశీలించాలని ప్రభుత్వాన్ని మణిపూర్ హైకోర్టు ఆదేశించడంతో మే 3 నుంచి నిరసనలు ప్రారంభమయ్యాయి. కుకీ, మెయిటీ తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణల్లో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి :

Irshalwadi landslide : పెద్ద మనసు చాటుకున్న సీఎం

Governor: గవర్నర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. నేను వారిని బద్ధ శత్రువులుగానే భావిస్తా..

Updated Date - 2023-07-23T09:42:48+05:30 IST