Share News

Assembly Elections 2023: రెండు రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ABN , First Publish Date - 2023-11-17T08:50:14+05:30 IST

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ స్టార్ట్ అయింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) తొలుత పోలింగ్‌ ప్రారంభమైంది.

Assembly Elections 2023: రెండు రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

భోపాల్, రాయ్ పుర్: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ స్టార్ట్ అయింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) తొలుత పోలింగ్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 230 స్థానాలకు ఒకే ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. 2,534 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 252 మంది మహిళలు నిలిచారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 6 గంటలవరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. రాష్ట్రంలో 5,60,58,521 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారిలో పురుష ఓటర్లు 2.88 కోట్లు కాగా, మహిళా ఓటర్లు(Voters) 2.72 కోట్లుగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 వేల 626 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్తగా 22 లక్షల 36 వేల మంది యువత ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ రెండో, చివరి దశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.


నక్సల్‌ ప్రభావిత రాష్ట్రంలో మొత్తం 90 నియోజకవర్గాలు ఉండగా, ఈనెల 7న తొలిదశలో 20 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన 70 నియోజకవర్గాలకు రెండో దశలో శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో 40 జనరల్‌, 17 ఎస్టీ, 9 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌, ఉపముఖ్యమంత్రి టీఎస్‌ సింగ్‌ దేవ్‌, ఎనిమిది మంది మంత్రులు, నలుగురు ఎంపీలు సహా కాంగ్రెస్‌(Congress) నుంచి రాజకీయ ఉద్దండులు పలువురు రెండోదశలోనే తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు.

అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఉండనుంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్(Kamalnath) చింద్వారాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "ప్రజలు సత్యం వైపు నిలుస్తారని నాకు నమ్మకం ఉంది. నేను ప్రజలను విశ్వసిస్తాను. మెజారిటీ మార్క్ కంటే ఎక్కువ ఓట్లు సీట్లే కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది. బీజేపీకి పోలీసులు, డబ్బు, అధికారం ఉంది. అవి మరికొన్ని గంటలు మాత్రమే ఉంటాయి. నిన్న నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. బీజేపీ నేతలు మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నట్లు చూపించే వీడియోను గుర్తు తెలియని వ్యక్తులు నాకు పంపారు" అని అన్నారు.

Updated Date - 2023-11-17T09:13:15+05:30 IST