Liquor stores: మద్యం దుకాణాల పనివేళల్లో మార్పులు?

ABN , First Publish Date - 2023-09-06T09:09:18+05:30 IST

హైకోర్టు సూచనల మేరకు రాష్ట్రంలోని టాస్మాక్‌ మద్యం దుకాణాల(Liquor stores) పనివేళల్లో మార్పులు చేపట్టడంపై రాష్ట్రప్రభుత్వం చర్యలు

Liquor stores: మద్యం దుకాణాల పనివేళల్లో మార్పులు?

- ఇకపై మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకే!

చెన్నై, (ఆంధ్రజ్యోతి): హైకోర్టు సూచనల మేరకు రాష్ట్రంలోని టాస్మాక్‌ మద్యం దుకాణాల(Liquor stores) పనివేళల్లో మార్పులు చేపట్టడంపై రాష్ట్రప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే టాస్మాక్‌ దుకాణాల్లో మద్యం విక్రయించడంపై యోచిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం రోజూ మధ్యాహ్నం 12 నుంచి రాత్రి పది గంటల వరకు దుకాణాలను తెరచి మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలను తెరిచే సమయాన్ని తగ్గించాలని కోరుతూ హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌(High Court Madurai Division Bench)లో కేకే రమేష్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో మద్యం విక్రయాలను మధ్యాహ్నం 2నుంచి రాత్రి 8 గంటల వరకే విక్రయించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అదే విధంగా 21 యేళ్లలోపు వారికి మద్యం విక్రయించకుండా నిషేధం విధించాలని, మద్యం కొనుగోలు చేసేవారికి గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. మద్యం విక్రయాల సమయాన్ని తగ్గించడంపై తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

అయితే కోర్టు సూచలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని, మద్యం దుకాణాల పనిగంటల్ని తగ్గించనందున కోర్టు ధిక్కరణగా భావించాలంటూ పిటిషనర్‌ రమేష్‌ మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు ఎస్‌ఎస్‌ సుందర్‌, భరత్‌ చక్రవర్తిలతో కూడి ధర్మాసనం ముందు విచారణ జరగ్గా.. టాస్మాక్‌ దుకాణాల్లో ధరల పట్టిక ఉంచుతున్నారో లేదో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ తరఫున న్యాయవాది గోవిందరాజన్‌ నేతృత్వంలోని కమిటీని ఆదేశించింది. అన్ని వివరాలతో అక్టోబర్‌ 23న నివేదికను సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అటు టాస్మాక్‌ దుకాణాల పనిగంటల తగ్గింపు కేసు, ఇటు కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కేసు విచారణలు జరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 వరకు టాస్మాక్‌ మద్యం దుకాణాలను తెరవడంపై అధికారుల అభిప్రాయాలను సేకరిస్తోంది.

Updated Date - 2023-09-06T09:09:19+05:30 IST