Covid-19: కోవిడ్-19 ముప్పు ఇంకా తొలగిపోలేదు

ABN , First Publish Date - 2023-03-23T19:25:01+05:30 IST

దేశంలో కోవిడ్-19 ముప్పు ఇంకా తొలగిపోలేదని కేంద్రం తెలిపింది.

Covid-19: కోవిడ్-19 ముప్పు ఇంకా తొలగిపోలేదు
latest details of Covid-19 in India

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్(Covid-19) కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 13 వందల కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా 718 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ(Ministry of Health and Family Welfare) తెలిపింది. రికవరీ రేటు 98.79%. తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 220 కోట్ల 65 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేశారు. మరోవైపు దేశంలో కోవిడ్-19 ముప్పు ఇంకా తొలగిపోలేదని కేంద్రం తెలిపింది.

కొవిడ్‌ పరీక్షలు, జన్యుక్రమ విశ్లేషణల సంఖ్యను పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మోదీ కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కరోనా టెస్టులతోపాటు జన్యుక్రమ విశ్లేషణ పరీక్షల సంఖ్య పెంచాల్సిన ఆవశ్యకతను వివరించారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారందరికీ కరోనా పరీక్షలు చేయాలని సూచించారు. అలాగే ఆస్పత్రుల్లో మాక్‌డ్రిల్స్‌ నిర్వహించాలని, మందులు, బెడ్‌లను సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు.

కొవిడ్‌ కేసుల్లో పెరుగుదలకు ఎక్స్‌బీబీ 1.16 వేరియంటే కారణమని ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అభిప్రాయపడ్డారు. అందుకే నాలుగు నెలల గరిష్ఠానికి కేసులు చేరుకున్నట్లు తెలిపారు. అధికారికంగా నమోదు కాని కేసులు కూడా ఉండే అవకాశాలున్నాయని చెప్పారు. ‘‘చాలా మంది ఇప్పుడు కొవిడ్‌ టెస్టులు చేయించుకోవడం లేదు. ఇళ్లలోనే రాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లతో పరీక్షలు చేసుకుంటున్నారు. ఒకవేళ వారికి పాజిటివ్‌ వచ్చినా.. రిపోర్ట్‌ చేయడం లేదు. లక్షణాలు లేకపోవడం వల్ల ఆస్పత్రులకు రావడం లేదు’’ అని ఆయన వివరించారు. ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్‌ ఒమిక్రాన్‌కు చెందినదే కావడం.. భారతీయులు చాలా మందిలో ఇమ్యూనిటీ రావడం వల్ల ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు సంభవించడంలేదని గులేరియా చెప్పారు.

Updated Date - 2023-03-23T19:25:04+05:30 IST