Kisan Mahapanchayat: పెద్ద ఉద్యమానికి సిద్ధంకండి...ఎస్‌కేఎం పిలుపు

ABN , First Publish Date - 2023-03-20T17:51:19+05:30 IST

చిరకాలంగా అపరిష్కతంగా ఉన్న డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై పెద్ద ఉద్యమానికి సిద్ధం కావాలని సంయుక్త కిసాన్ మోర్చా..

Kisan Mahapanchayat: పెద్ద ఉద్యమానికి సిద్ధంకండి...ఎస్‌కేఎం పిలుపు

న్యూఢిల్లీ: చిరకాలంగా అపరిష్కతంగా ఉన్న డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై పెద్ద ఉద్యమానికి సిద్ధం కావాలని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) రైతులకు పిలుపునిచ్చింది. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదిపాటు పోరాటం సాగించి విజయం సాధించిన ఎస్‌కేఎం.. సోమవారంనాడు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో (Ramlila Maidan)లో కిసాన్ మహాపంచాయతీ(Kisan Mahapanchayat)ని నిర్వహించింది. అపరిష్కృతంగా ఉన్న రైతు డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేసింది.

కేంద్ర మంత్రిని కలిసిన ప్రతినిధి బృందం

అపరిష్కృత రైతు డిమాండ్లపై ఏకాభిప్రాయానికి సాధించే దిశగా సోమవారంనాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్, రైతు ప్రతినిధుల మధ్య సమావేశం జరిగింది. సమావేశానంతరం రైతు నేత దర్శన్ పాల్ మీడియాతో మాట్లాడుతూ, రైతు డిమాండ్లతో కూడిన లేఖను వ్యవసాయ మంత్రికి అందజేసినట్టు చెప్పారు. ఏప్రిల్ 30న రైతుల సమావేశం ఉంటుందన్నారు. రైతులు తమ డిమాండ్ల సాధనకు 2020 కంటే పెద్ద ఉద్యమం ప్రారంభిస్తుందని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఆందోళనలు నిర్వహించేందుకు రైతులు సిద్ధం కావాలని ఆయన కోరారు. ''ప్రతి రాష్ట్రంలోనూ యునైటెడ్ కిసాన్ మోర్చా ఏర్పాటు చేస్తాం. త్వరలోనే ఇందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తాం'' అని దర్శన్ పాల్ చెప్పారు.

లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చండి...

పార్లమెంటుకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన కిసాన్ మహాపంచాయతీకి వేలాది మంది రైతులు రంగురంగుల టర్బన్లు ధరించి హాజరయ్యారు. 2021 డిసెంబర్‌లో లిఖిత పూర్వకంగా తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా రైతులు, రైతు నేతలు డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరకు (MSP) చట్టబద్ధత కల్పించాలని, రైతులపై నమోదు చేసిన కేసులు ఉపసంహరించాలని, నిరసనల్లో మృతి చెందిన రైతులకు పరిహారం ఇవ్వాలని, పెన్షన్లు, రుణాల రద్దు, విద్యుత్ బిల్లుల ఉపసంహరణ జరపాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వీటికి సంబంధించి లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని జై కిసాన్ ఆందోళన్ జాతీయ అధ్యక్షుడు అవిక్ సహా తెలిపారు. రైతులపై వేలాది కేసులు పెండింగ్‌లవో ఉన్నాయని, రైతు నిరసనల్లో 750 మందికి పైగా రైతులు మరణిస్తే ఇంతవరకూ వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదని అన్నారు. మరికొన్ని డిమాండ్లు కూడా ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయని తెలిపారు.

కాగా, 2021 నవంబర్‌లో సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, దేశవ్యాప్తంగా రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు వీలుగా అవసరమైన సూచనలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటిస్తూ గత ఏడాది జూలైలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎస్‌కేఎంలోని ముగ్గురు సభ్యులకు కమిటీలో చోటు కల్పిస్తామని కేంద్రం ప్రతిపాదించగా, కమిటీ ఎజెండాలో ఎంఎస్‌పీపై చట్ట ప్రస్తావన లేదంటూ ఆ ప్రతిపాదనను ఎస్‌కేఎం తోసిపుచ్చింది.

Updated Date - 2023-03-20T17:51:24+05:30 IST