Share News

Kerala Bomb Blast: కేరళ పేలుళ్ల కేసులో కీలక పరిణామం.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద బాధ్యుడు అరెస్టు

ABN , First Publish Date - 2023-10-30T22:14:06+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ పేలుళ్ల కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పేలుళ్లకు తానే బాధ్యుడినని పేర్కొన్న డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తిని ఉగ్రవాద నిరోధక చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు.

Kerala Bomb Blast: కేరళ పేలుళ్ల కేసులో కీలక పరిణామం.. ఉగ్రవాద నిరోధక చట్టం కింద బాధ్యుడు అరెస్టు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ పేలుళ్ల కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పేలుళ్లకు తానే బాధ్యుడినని పేర్కొన్న డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తిని ఉగ్రవాద నిరోధక చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం, హత్యా నేరాల కింద అతడిని సోమవారం అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. తానే ఈ కన్వెన్షన్ సెంటర్‌లో బాంబులు పెట్టానని ప్రకటిస్తూ.. పోలీసుల ముందు మార్టిన్ లొంగిపోయిన ఒక రోజు తర్వాత అతడ్ని అరెస్ట్ చేయడం జరిగింది.

తాను లొంగిపోవడానికి ముందు.. కలమస్సేరిలోని జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘యెహోవా విట్‌నెసెస్’ అనే క్రిస్టియన్ సమూహం ప్రార్థనలు చేస్తున్న సమయంలో బాంబులు ఎందుకు పెట్టానో ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తానూ కొన్ని సంవత్సరాల నుంచి యెహోవా విట్‌నెసెస్ గ్రూపులో ఉన్నానని, అయితే వారి బోధనలు విద్రోహపూరితంగా ఉన్నాయని తెలిపాడు. తమ తీరు మార్చుకోవాలని వాళ్లను ఎన్నిసార్లు హెచ్చరించినా ఫలితం లేకుండా పోయిందని, అందుకే ఈ పేలుళ్లకు పాల్పడ్డానని పేర్కొన్నాడు. ఆ సంస్థ భావజాలం దేశానికి అత్యంత ప్రమాదకరమైనదని, వాళ్లు ఎవరికీ సహాయం చేయరు, ఎవరినీ గౌరవించరని చెప్పాడు.


తాము తప్ప మిగతా వాళ్లందరూ నాశనం అవ్వాలనేదే ఆ సంస్థ భావజాలమని మార్టిన్ వెల్లడించాడు. దేశంలో నివసిస్తున్న మహిళల్ని వ్యభిచారులు అని పిలిచేవారని.. ఇతరులతో భోజనం కూడా చేసేవారు కాదని వివరించాడు. ఎన్నికల సమయాల్లో ఓటు వేయొద్దని, సైన్యంలోనూ చేరొద్దని ‘యెహోవా విట్‌నెసెస్’ వాళ్లు చెప్పేవారని తెలిపాడు. ఇలాంటి ఆలోచనలు వ్యాప్తి చెందితే ఎంతో ప్రమాదమని, ఈ రకమైన సంస్థల్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. ఆరేళ్ల క్రితం ఈ సంస్థలో తాను చేరానని.. క్రమంగా ఈ సంస్థ తప్పుడు మార్గంలో ఉందని ఉందని, వారి బోధనలు దేశ వ్యతిరేకమని తాను గ్రహించానన్నాడు.

కాగా.. నిమిషాల వ్యవధిలో ఆ కన్వెన్షన్‌లో మూడు పేలుళ్లు సంభవించగా.. ముగ్గురు మృతి చెందారు. తొలుత ఈ పేలుళ్లు సంభవించినప్పుడు ఘటనా స్థలంలో ఒకరు మరణించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన ఆరుగురిలో 53 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అలాగే.. సోమవారం ఉదయం 95 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన 12 ఏళ్ల బాలిక సైతం మృతిచెందడంతో, మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఈ ఘటనలో గాయాపాలైన 45 మంది చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2023-10-30T22:14:06+05:30 IST