Kerala Govt: స్థానికుల ఆందోళనతో పట్టువీడిన కేరళ సర్కార్.. విషయం ఏంటంటే..
ABN , First Publish Date - 2023-09-02T09:06:44+05:30 IST
కన్నియాకుమారి జిల్లా తక్కలై ప్రాంతం వద్ద కేరళ ప్రభుత్వ(Kerala Govt) ఆధీనంలోని పద్మనాభపురం రాజభవనంలో
- పద్మనాభపురం రాజభవనంలో ఓనం వేడుకలు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): కన్నియాకుమారి జిల్లా తక్కలై ప్రాంతం వద్ద కేరళ ప్రభుత్వ(Kerala Govt) ఆధీనంలోని పద్మనాభపురం రాజభవనంలో ఎట్టకేలకు శుక్రవారం ఉదయం ఓనం వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రతియేటా ఆ రాజభవనం వద్ద పది రోజులపాటు ఓనం వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ యేడాది ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ రాజభవనం వద్ద ఓనం వేడుకలను(Onam celebrations) కేరళ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఓనం వేడుకలు ఎప్పటివలెనే జరపాలని డిమాండ్ చేస్తూ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. గత మూడు రోజులుగా స్థానికులు పద్మనాభపురం రాజభవనం వద్ద కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శనలు కొనసాగించారు. ఆందోళన తీవ్రరూపం దాల్చటంతో కేరళ ప్రభుత్వం పట్టు సడలించింది. శుక్రవారం ఉదయం నుంచి ఐదు రోజులపాటు పద్మనాభపురం(Padmanabhapuram) రాజభవనంలో ఓనం వేడుకలు నిర్వహించనున్నట్లు కేరళ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. దీంతో శుక్రవారం ఉదయం రాజభవనం అంతటా విద్యుద్దీపాలంకరణ చేశారు. భారీ ఊయల కూడా ఏర్పాటు చేశారు. కొంతమంది కేరళ యువతులు ఆ రాజభవనం ముందు అత్తిపూల రంగవళ్లులు కూడా తీర్చిదిద్దారు. వేడుకలు ఐదు రోజులపాటు నిర్వహించనున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
