Keeravani : సుమధుర బాణీ.. కేరాఫ్‌ కీరవాణీ!

ABN , First Publish Date - 2023-03-14T04:00:24+05:30 IST

కీరవాణి పూర్తి పేరు కోడూరి మరకతమణి కీరవాణి. 1961 జూలై 4న జన్మించారు. తండ్రి శివ శక్తి దత్త పేరొందిన రచయిత. కీరవాణి తన తొలినాళ్లలో చక్రవర్తి దగ్గర శిష్యరికం చేశారు. ఉషాకిరణ్‌ మూవీస్‌

Keeravani  : సుమధుర బాణీ.. కేరాఫ్‌ కీరవాణీ!

కీరవాణి పూర్తి పేరు కోడూరి మరకతమణి కీరవాణి. 1961 జూలై 4న జన్మించారు. తండ్రి శివ శక్తి దత్త పేరొందిన రచయిత. కీరవాణి తన తొలినాళ్లలో చక్రవర్తి దగ్గర శిష్యరికం చేశారు. ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ‘మనసు - మమత’తో సంగీత దర్శకుడిగా తన ప్రయాణం ప్రారంభించారు కీరవాణికి. ‘సీతారామయ్య గారి మనవరాలు’తో ఆయనకు బ్రేక్‌ వచ్చింది. ‘మాతృదేవోభవ’తో కీరవాణి పేరు మార్మిగిపోయింది. ఈ చిత్రంలో ‘రాలిపోయే పువ్వా..’, ‘వేణువై వచ్చాను భువనానికీ’ గీతాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ‘క్షణం క్షణం’లో కమర్షియల్‌ బ్రేక్‌ దక్కిందఇ. ఈ సినిమాలోని పాటలన్నీ హిట్టే. కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో కీరవాణి చేసిన సినిమాలన్నీ మ్యూజికల్‌ హిట్స్‌గా నిలిచాయి. ‘అల్లరి ప్రియుడు’ క్యాసెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ‘అన్నమయ్య’ నుంచి మరో చరిత్ర మొదలైంది. అప్పటి నుంచీ ఆధ్యాత్మిక చిత్రాలకు సంగీతం అనగానే మొదట కీరవాణినే గుర్తుకొస్తారు. ఈ సినిమాతో కీరవాణికి జాతీయ అవార్డు కూడా దక్కింది. దర్శకేంద్రుడితో దాదాపు పాతిక చిత్రాలు చేశారు. దాదాపుగా అగ్ర హీరోలందరి చిత్రాలకూ పని చేశారు. ‘స్డూడెంట్‌ నెంబర్‌ 1’తో రాఘవేంద్రరావు శిష్యుడు రాజమౌళితో ప్రయాణం ప్రారంభించారు కీరవాణి. అప్పటి నుంచీ.. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ వరకూ ఆ అనుబంధం కొనసాగుతూనే ఉంది. రాజమౌళి అప్రహిత విజయ యాత్రలో కీరవాణికీ వాటా ఉంది. సన్నివేశాన్ని తన నేపథ్య సంగీతంతో ఎలివేట్‌ చేయడంలో కీరవాణి నేర్పు ఆయా చిత్రాల్లో అడుగడుగునా కనిపిస్తుంది. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు తెచ్చుకొన్న కీరవాణి.. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’తో అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చుకొన్నారు. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కింది. ఇప్పుడు ఆస్కార్‌ అందుకొన్నారు. ఈ యేడాదే కీరవాణికి కేంద్రం పద్మశ్రీ కూడా ప్రకటించింది. కీరవాణికి ఇద్దరు కుమారులు. కాలభైరవ సంగీత దర్శకుడిగా మారితే, జై సింహా నటుడిగా ఇప్పుడిప్పుడే ప్రయాణం మొదలెట్టారు.

Updated Date - 2023-03-14T04:00:24+05:30 IST