Kaveri dispute: రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.. కావేరిపై సుప్రీంకోర్టుకు..

ABN , First Publish Date - 2023-08-13T08:21:37+05:30 IST

కావేరి జలాలు(Kaveri waters) విడుదల చేయకుండా మొండిగా వ్యవహరిస్తున్న కర్ణాటక ప్రభుత్వానికి ముకుతాడు వేసేందుకు సుప్రీంకోర్టు తలుపుతట్టాలని

Kaveri dispute: రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.. కావేరిపై సుప్రీంకోర్టుకు..

- రేపు పిటిషన్‌ దాఖలు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): కావేరి జలాలు(Kaveri waters) విడుదల చేయకుండా మొండిగా వ్యవహరిస్తున్న కర్ణాటక ప్రభుత్వానికి ముకుతాడు వేసేందుకు సుప్రీంకోర్టు తలుపుతట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ నెల 14వ తేదీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయాలని భావిస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌(Minister Durai Murugan) శనివారం ప్రకటించారు. కర్ణాటక(Karnataka)లోని నాలుగు ప్రధాన జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ దిగువకు వదలకుండా కర్ణాటక ప్రభుత్వం మొండికేయడం గర్హనీయమని ఆరోపించారు. కావేరి జలాల కోసం చేపట్టాల్సిన తదుపరి చర్యలపై నీటి వనరుల శాఖ ఉన్నతాధికారుల గత రెండు రోజులుగా సమీక్షించానని, ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా గత్యంతరం కనిపించలేదన్నారు. ఈ నెల 14న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని, అత్యవసర కేసుగా పరిగణించి త్వరగా విచారణ చేపట్టాలని కోరతామని దురైమురుగన్‌ వివరించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 11వ తేదీ నాటికి 53.77 టీఎంసీల మేరకు కావేరి జిలాలను రాష్ట్రానికి విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కర్ణాటక నుండి కేవలం 15.73 టీఎంసీల జలాలు మాత్రమే విడుదలయ్యాయి. మేట్టూరు డ్యాం నుంచి సాగు జలాలను జూన్‌ 12న విడుదల చేయడంతో ప్రస్తుతం ఆ డ్యామ్‌లో నీటిమట్టం అడుగంటుతోంది.

nani4.2.jpg

ఆ డ్యామ్‌లోని జలాలు డెల్టా సాగుకు వారం రోజులపాటు సరిపోతాయని, ఆ తర్వాత పంటలకు నీరందించలేమని ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కావేరి జలాలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాసినా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో శుక్రవారం జరిగిన కావేరి నిర్వాహక మండలి సమావేశంలో పాల్గొన్న కర్ణాటక ప్రభుత్వ ప్రతినిధులు కావేరి జలాలను విడుదల చేసే ప్రసక్తే లేదని ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన ప్రతినిధులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. దీంతో కావేరి నిర్వాహక మండలి తక్షణమే కావేరి జిల్లాలను విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ ఆదేశం వెలువడిన కొద్దిసేపటికే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయలేమని ప్రకటించారు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

nani4.3.jpg

Updated Date - 2023-08-13T08:21:38+05:30 IST