Jaya Bachchan: బీజేపీపై జయా బచ్చన్ పంజా.. నన్నే అడ్డుకుంటారా అంటూ విరుచుకుపడిన ఎంపీ

ABN , First Publish Date - 2023-09-21T20:37:16+05:30 IST

గురువారం రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, నటి జయా బచ్చన్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ప్రసంగాన్ని కొందరు ఎంపీలు అడ్డుకోవడంతో..

Jaya Bachchan: బీజేపీపై జయా బచ్చన్ పంజా.. నన్నే అడ్డుకుంటారా అంటూ విరుచుకుపడిన ఎంపీ

గురువారం రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, నటి జయా బచ్చన్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ప్రసంగాన్ని కొందరు ఎంపీలు అడ్డుకోవడంతో.. తాను వ్యతిరేకంగా అభ్యంతరం వ్యక్తం చేస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జయా బచ్చన్ ప్రసంగిస్తూ.. మహిళలను గౌరవించే ఈ సంప్రదాయం ‘ఆడంబరం’గా ఉండదని తాను ఆశిస్తున్నానని, ఇది ఇంకా కొనసాగుతుందని అన్నారు. లేకపోతే.. సభలోని మహిళల్ని మిమ్మల్ని (రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్‌) ప్లాస్టిక్ సర్జన్ అని పిలుస్తారని ఛలోక్తులు పేల్చారు.

జయా బచ్చన్ ఇంకా మాట్లాడుతూ.. మీ (జగ్‌దీప్ ధన్‌కర్) కుర్చీ చాలా ఆసక్తికరంగా ఉందని, అదొక ఉయ్యాల తరహాలో అటూ ఇటూ కదులుతుంటుందని అన్నారు. అయినా.. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి తాము ఎవరని ప్రశ్నించారు. తమకు ధైర్యం ఉంది కాబట్టి తాము పార్లమెంట్‌లో అడుగుపెట్టామని, తమ నాయకుల్లో ధైర్యం ఉంది కాబట్టే వాళ్లు తమని ఇక్కడికి తీసుకొచ్చారని అన్నారు. కానీ.. మహిళల్ని తీసుకురావాల్సిన వారు ఏం చేస్తున్నారో తెలియడం లేదని.. బీజేపీకి చురకలంటించారు. ఎన్నికలు జరుగుతాయా, లేవా..? గెలిపిస్తారా, గెలిపించరా? అనేది తెలియదని చెప్పారు. ఎక్కడి నుంచైతే ఓడిపోతారే, అక్కడే మహిళలకు వాళ్లు (బీజేపీ) టికెట్లు ఇస్తారని కౌంటర్ వేశారు. ఇప్పుడు ఈ డ్రామాని ఆపాలని పార్లమెంట్‌లో ఉద్ఘాటించారు.


ఇంతలో పార్లమెంట్‌లో ఉన్న బీజేపీ నేతలు అడ్డుకోవడంతో.. జయా బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీరు బిల్లు సమర్పించేశారు. ఇప్పుడు మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఒకవేళ మీరు అడ్డుకుంటే మాత్రం.. మీకు వ్యతిరేకంగా అభ్యంతరం తెలుపుతాను. మేం ఏం చెప్పాలనుకున్నామో అది చెప్పనివ్వండి’’ అంటూ ఫైర్ అయ్యారు. ఈ బీజేపీ వాళ్లు ప్రతీ చిన్న విషయంపై కామెంట్లు చేస్తారని, అదే తాము చేస్తే మాత్రం వీళ్లకు కోపం నషాళానికి ఎక్కుతుందంటూ సెటైర్లు వేశారు. అనంతరం.. ఈ బిల్లు గతంలో కూడా వచ్చిందని, ఆ సమయంలో సుష్మా స్వరాజ్‌తో పాటు వృందా కరాత్ అద్భుతమైన ప్రసంగాలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు లోక్‌సభలో పాసైన బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, దీనికి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు.

అయితే.. ఈ బిల్లులో ఒక అంశం తనని కలచివేస్తోందని జయా బచ్చన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 33 శాతం టిక్కెట్లు ఇవ్వాలని మీరు కోరుకుంటే.. ముస్లిం మహిళలకు ఎన్ని టిక్కెట్లు ఇస్తారని ఆమె ప్రశ్నించారు. మీకు ధైర్మం ఉంటే.. బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిల్లు ఆమోదం పొందిందని కేవలం డప్పు కొట్టుకుంటే సరిపోదని.. బిల్లుని అమలు చేసి, అప్పుడు ప్రచారం చేసుకోండని ఛాలెంజ్ చేశారు. మీరు ప్రతి చిన్న విషయానికి అనవసరమైన ప్రచారం చేస్తుంటారని.. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Updated Date - 2023-09-21T20:37:56+05:30 IST