Aditya L1: ఆదిత్య ఎల్1 తొలి విన్యాసం విజయవంతం.. అధికారికంగా ప్రకటించిన ఇస్రో

ABN , First Publish Date - 2023-09-03T15:36:28+05:30 IST

సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు గాను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ‘ఆదిత్య-ఎల్1’ మిషన్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం శ్రీహరికోటలోని...

Aditya L1: ఆదిత్య ఎల్1 తొలి విన్యాసం విజయవంతం.. అధికారికంగా ప్రకటించిన ఇస్రో

సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు గాను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ‘ఆదిత్య-ఎల్1’ మిషన్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్‌వీ-సీ57 వాహననౌక ఆదిత్య-ఎల్1 ఉపగ్రహంతో నింగిలోకి దూసుకెళ్లింది. ఇప్పుడు ఇది తొలి భూ కక్ష్య పెంపు విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆదివారం ఇస్రో వెల్లడించింది. బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ISTRAC)’ నుంచి ఈ ప్రక్రియను చేపట్టినట్లు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం ఈ ఆదిత్య-ఎల్‌1 245×22,459 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో తిరుగుతోంది. ఈ మిషన్ సజావుగా సాగుతోందని, తదుపరి భూ కక్ష్య పెంపు విన్యాసాన్ని సెప్టెంబర్ 5న నిర్వహించనున్నట్టు ఇస్రో పేర్కొంది.


‘‘ఆదిత్య-L1 ఉపగ్రహం బాగానే ఉంది. ఈ మిషన్ సజావుగా సాగుతోంది. బెంగళూరులోని ISTRAC నుండి తొలి భూకక్ష్య పెంపు విన్యాసం విజయవంతంగా నిర్వహించబడింది. ప్రస్తుతం ఈ ఉపగ్రహం 245x22459 కిమీ దూరంలోని కక్ష్యలోకి చేరుకుంది. తదుపరి భూ కక్ష్య పెంపు విన్యాసం సెప్టెంబర్ 5న తెల్లవారుజామున 3 గంటలకు షెడ్యూల్ చేయబడింది’’ అని ట్విటర్ (X ప్లాట్‌ఫామ్) మాధ్యమంగా ఇస్రో తెలిపింది. ఈ విన్యాసాల్లో భాగంగా ఆదిత్య ఎల్‌1లోని ఆన్‌బోర్డ్ ఇంజిన్లను మండించి.. ఒకవైపు కక్ష్యను పెంచడం, మరోవైపు శాటిలైట్ కోణాన్ని సరిచేయడం వంటివి ఇస్రో శాస్త్రవేత్తలు చేస్తారు. భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటపడేందుకు స్పేస్‌క్రాఫ్ట్ ఆర్బిట్‌ని దశలవారీగా పెంచుతారు. చివరగా ఇది భూమి ఆకర్షణ నుంచి బయటపడి.. లక్ష్యం (ఎల్1 పాయింట్) దిశగా వెళ్తుంది.

కాగా.. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ వద్ద ఉన్న దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేరాలి. అందుకు 4 నెలల సమయం పడుతుంది. ఇది 16 రోజుల పాటు భూ కక్ష్యల్లోనే చక్కర్లు కొట్టనుంది. ఆ తర్వాత నిర్దేశిత ఎల్‌1 బిందువు దిశగా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ ఆదిత్య ఎల్1 శాటిలైట్‌లో మొత్తం 7 పేలోడ్స్ ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌‌తో పాటు వెలుపల ఉండే కరోనాని అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులతో పాటు అక్కడి వాతావరణం గురించి ఇవి శోధిస్తాయి.

Updated Date - 2023-09-03T15:36:28+05:30 IST