Venus Mission: ఇస్రో నెక్ట్స్ మిషన్ కన్ఫమ్ చేసిన ఛైర్మన్ సోమనాథ్.. శుక్రుడిపై వెళ్లేందుకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2023-09-27T16:41:39+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇటీవల చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతం అయ్యింది. దీని తరువాత సూర్యుని అధ్యయనం కోసం ఆదిత్య L1 కూడా ప్రారంభించింది. ఇది తన లక్ష్యం దిశగా...

Venus Mission: ఇస్రో నెక్ట్స్ మిషన్ కన్ఫమ్ చేసిన ఛైర్మన్ సోమనాథ్.. శుక్రుడిపై వెళ్లేందుకు సర్వం సిద్ధం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇటీవల చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతం అయ్యింది. దీని తరువాత సూర్యుని అధ్యయనం కోసం ఆదిత్య L1 కూడా ప్రారంభించింది. ఇది తన లక్ష్యం దిశగా ప్రయాణం చేస్తోంది. ఈ ఉత్సాహంలోనే ఇస్రో మరో కొత్త మిషన్ చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. అదే వీనస్ మిషన్. ఈ విషయాన్ని స్వయంగా ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ స్పష్టం చేశారు. సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహమైన వీనస్ (శుక్రుడు) కోసం భారత్ మిషన్ సిద్ధమైందని తెలిపారు. ఈ మిషన్‌కు సంబంధించిన పేలోడ్‌ను ఇప్పటికే అభివృద్ధి చేసినట్లు ఆయన తెలియజేశారు.

ఢిల్లీలోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో సోమనాథ్ మాట్లాడుతూ.. ‘‘మా దగ్గర చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అవి ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి. అయితే.. వీనస్‌కు మిషన్ ఇప్పటికే ప్రణాళిక చేయబడింది. దీనికోసం ఇప్పటికే పేలోడ్స్‌ని అభివృద్ధి చేయడం జరిగింది. వీనస్ ఒక ఆసక్తికరమైన గ్రహం. దీనిని అన్వేషించడం వల్ల అంతరిక్ష శాస్త్ర రంగంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి’’ అని అన్నారు. వీనస్‌కి వాతావరణం ఉంటుందని, అది ఎంతో దట్టమైనదని పేర్కొన్నారు. అక్కడి వాతావరణ పీడనం భూమి కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ గ్రహం మొత్తం యాసిడ్‌తో నిండి ఉంటుందని, దాని ఉపరితలంపై ఎవరూ ప్రవేశించలేరని వెల్లడించారు.


శుక్రుడి ఉపరితలం గట్టిగా ఉందో లేదో ఎవరికీ తెలియదన్న సోమనాథ్.. వీనస్ మిషన్ చేపట్టడం వెనుక గల ప్రధాన కారణాన్ని బయటపెట్టారు. భూమి కూడా ఒకప్పుడు శుక్రుడు గ్రహంలాగే ఉండొచ్చన్న సందేహాన్ని వ్యక్తపరిచారు. 10,000 సంవత్సరాల తర్వాత భూమి తన లక్షణాలను మార్చుకునే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. భూమి ఎప్పుడూ ఇలా ఉండేది కాదని, చాలాకాలం క్రితం ఇది నివాసయోగ్యమైన ప్రదేశం కాదని గుర్తు చేశారు. కాగా.. ఈ మిషన్‌కి ఇంకా పేరు పెట్టలేదు కానీ, బహుశా దీనికి ‘శుక్రయాన్’ అనే నామకరణం చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్‌ని వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా.. సూర్యుని నుంచి రెండో గ్రహం అయిన శుక్రుడు, భూమిని సమీపంలో ఉంటుంది. పరిమాణం, సాంధ్రతలో సారూప్యత కారణంగా.. దీనిని ‘భూమి జంట’గా పిలుస్తుంటారు. ఇదిలావుండగా.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ఇదివరకే వీనస్ మిషన్‌ను నిర్వహించింది. ఇది 2006 నుండి 2016 వరకు కక్ష్యలో ఉంది. 2016 నుండి కక్ష్యలో ఉన్న జపాన్‌కు చెందిన అకాట్సుకి వీనస్ క్లైమేట్ ఆర్బిటర్ కూడా గ్రహంపైకి మిషన్‌ను నిర్వహించింది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) వీనస్‌పైకి అనేక ఫ్లైబైలు, ఇతర మిషన్‌లను ప్రారంభించింది.

Updated Date - 2023-09-27T16:41:39+05:30 IST