BJP: మాట్లాడే ముందు హోం వర్క్ చేయండి.. రాహుల్‌కి బీజేపీ కౌంటర్

ABN , First Publish Date - 2023-02-07T19:51:41+05:30 IST

బిలియనీర్ గౌతమ్ అదానీతో మోదీ సాన్నిహిత్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. అవన్నీ...

BJP: మాట్లాడే ముందు హోం వర్క్ చేయండి.. రాహుల్‌కి బీజేపీ కౌంటర్

న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీతో మోదీ సాన్నిహిత్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. అవన్నీ నిరాధారణమైన ఆరోపణలని తెలిపింది. ఆయన మాట్లాడేముందు సమాచారం కోసం తగిన హోమ్‌వర్క్ చేస్తే బాగుంటుందని సూచించింది.

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ, మోదీకి పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ (Gautam Adani)తో ఉన్న సంబంధాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాను నిర్వహించిన భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు ఒకే ఒక వ్యాపారవేత్త పేరు వినిపించిందని, అది గౌతమ్ అదానీ అని చెప్పారు. ఒకప్పుడు అదానీ విమానంలో మోదీ ప్రయాణించేవారని, ఇప్పుడు మోదీ విమానంలో అదానీ ప్రయాణిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం అంతకు ముందు గుజరాత్‌కు సంబంధించినదని, ఆ తర్వాత భారత దేశానికి సంబంధించినది అయిందని, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరిందని అన్నారు. గడచిన ఇరవయ్యేళ్ళలో బీజేపీకి అదానీ ఎంత సొమ్ము ఇచ్చారని, ఎలక్టొరల్ బాండ్ల ద్వారా ఎంత ముట్టజెప్పారని నిలదీశారు. మోదీ-అదానీ కలిసి ఉన్న ఓ ఫొటోను లోక్‌సభలో ప్రదర్శించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి రాష్ట్రపతి ప్రసంగంలో లేవన్నారు.

ఆరోపణలు నిరాధారం..

కాగా, రాహుల్ ఆరోపణలను బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తిప్పికొట్టారు. రాహుల్ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని, ప్రధానమంత్రి పైన, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వంపైన దేశ ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందని అన్నారు. రాహుల్ ఆరోపణలు చూస్తే ఆయనకున్న ఇంటెలిజెన్స్‌పై ప్రశలు తలెత్తుతున్నాయని, తొలిసారి పార్లమెంటులో మాట్లాడిన రాష్ట్రపతి ప్రసంగంపై ఆయనకు ఏమాత్రం గౌరవం లేదని అన్నారు. మోదీపై చేసిన ఆరోపణలు రుజువు చేయగలిగే ఆధారాలు కానీ, డాక్యుమెంట్లు ఉంటే వాటిని సభకు సమర్పించి ఉండాల్సిందన్నారు. సభలో మాట్లాడింది రాహుల్ కాదని, అసహనమే ఆయనలో కనిపించదని అన్నారు. ప్రధాని పైనో, ప్రభుత్వంపైనే తీవ్రమైన ఆరోపణలు చేసేటప్పుడు తగిన రీసెర్చ్ వర్క్ కానీ, హోం వర్క్ కానీ చేసుంటే బాగుంటుందని హితవు పలికారు. ''రాజస్థాన్‌లో మెగాప్రాజెక్టుల కోసం సేకరించిన భూమి గురించి తన బావను రాహుల్ అడిగి ఉండొచ్చు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఆయన పార్టీ పాలనలోనే ఉంది. అదానీ, ఆయన గ్రూప్‌లకు ఆ ప్రభుత్వం ఇచ్చిన భూములపై సొంత పార్టీ నేతనే రాహుల్ ప్రశ్నించి ఉండవచ్చు'' అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.

Updated Date - 2023-02-07T19:54:04+05:30 IST