Turkiye and Syria : భూకంప బాధిత టర్కీ, సిరియాలకు ఆరో విడత సాయం పంపనున్న భారత్

ABN , First Publish Date - 2023-02-08T11:17:04+05:30 IST

భూకంపాల వల్ల తీవ్ర కష్టాల్లో చిక్కుకున్న తుర్కియే, సిరియా దేశాలకు ఆరో విడత సాయం పంపించేందుకు భారత దేశం సన్నాహాలు చేస్తోంది.

Turkiye and Syria : భూకంప బాధిత టర్కీ, సిరియాలకు ఆరో విడత సాయం పంపనున్న భారత్
Turkey Earthquake

న్యూఢిల్లీ : భూకంపాల వల్ల తీవ్ర కష్టాల్లో చిక్కుకున్న తుర్కియే, సిరియా దేశాలకు ఆరో విడత సాయం పంపించేందుకు భారత దేశం సన్నాహాలు చేస్తోంది. అత్యంత భారీ రవాణా విమానం సీ-17లో సహాయక సామాగ్రిని పంపించబోతోంది. అయితే పాకిస్థాన్ తన నీచ బుద్ధిని విడనాడకుండా, తన గగనతలంపై నుంచి ఈ విమానం వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో, ఈ విమానం ఇరాన్ మీదుగా మరింత ఎక్కువ దూరం ప్రయాణించవలసి వస్తోంది. మరోవైపు పాకిస్థాన్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి టర్కీలో పర్యటించేందుకు అనుమతి రాలేదు.

భారత దేశం ఇప్పటికే ఇండియన్ మిలిటరీ విమానం సీ-17లో నాలుగుసార్లు తుర్కియేకు, ఒకసారి సిరియాకు మానవతావాద సహాయాన్ని అందించింది. మొత్తం మీద ఈ రెండు దేశాలకు ఇప్పటి వరకు మందులు, పరికరాలు వంటి 108 టన్నుల సహాయక సామాగ్రిని అందజేసింది, ఈ విమానాల్లో ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు, డాగ్ స్క్వాడ్స్ కూడా వెళ్లాయి.

భూకంపాల బాధిత తుర్కియేకు సంఘీభావం తెలిపేందుకు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif), విదేశాంగ మంత్రి బిలావల్ జర్దారీ అంకారాకు వెళ్లాలని ప్రయత్నించారు. కానీ సహాయ కార్యకలాపాల్లో నిమగ్నమైనందువల్ల వీరి పర్యటనకు తుర్కియే అనుమతి ఇవ్వలేదు.

Updated Date - 2023-02-08T11:17:08+05:30 IST