Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీంను రప్పించే ప్రయత్నాలు సాగేది ఇంకెంత కాలం?

ABN , First Publish Date - 2023-05-06T13:50:41+05:30 IST

షాంఘై సహకార సంఘం (SCO) విదేశాంగ మంత్రుల మండలి సమావేశాల్లో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ

Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీంను రప్పించే ప్రయత్నాలు సాగేది ఇంకెంత కాలం?
Dawood Ibrahim, S Jaishankar, Bilawal Bhutto Zardari

న్యూఢిల్లీ : షాంఘై సహకార సంఘం (SCO) విదేశాంగ మంత్రుల మండలి సమావేశాల్లో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ (Bilawal Bhutto Zardari) పాల్గొన్నారు. గోవాలో జరిగిన ఈ సమావేశాల సందర్భంగా మన విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar)తో ద్వైపాక్షిక చర్చలు జరగకపోయినప్పటికీ, ఇరువురూ మీడియా ముందు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడుకోరాదని, దౌత్యపరమైన పాయింట్లు స్కోర్ చేయడానికి ఉపయోగించుకోకూడదని బిలావల్ సుద్దులు చెప్పారు. దీనికి జైశంకర్ పనజీలో విలేకర్ల సమావేశంలో దీటుగా బదులిస్తూ, బిలావల్ ఉగ్రవాద పరిశ్రమకు ప్రమోటర్, సమర్థకుడు, అధికార ప్రతినిధి అని దుయ్యబట్టారు. బిలావల్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్‌కు అప్పగించడంపై స్పందించలేదు.

దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోని కరాచీలో ఉంటున్నట్లు తెలుస్తోందని, ఆయనను భారత దేశానికి అప్పగించకపోతే, ఉగ్రవాదంపై పాకిస్థాన్ చర్యలు తీసుకుంటుందని భారత్ ఎలా నమ్మాలని మీడియా ప్రతినిధి అడిగినపుడు బిలావల్ భుట్టో జర్దారీ స్పందిస్తూ, 2019 ఆగస్టులో జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని భారత ప్రభుత్వం తొలగించినందువల్లే ఇరు దేశాల మధ్య శాంతికి విఘాతం కలిగిందన్నారు. దావూద్‌ను భారత్‌కు అప్పగించడం వల్ల ఉద్రిక్తతలు సడలుతాయనే అంశాన్ని బలపరచడానికి ఆయన తిరస్కరించారు.

దావూద్ గురించి..

దావూద్ ఇబ్రహీం భారత దేశంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు సూత్రధారి. 1993లో ముంబైలో జరిగిన వరుస పేలుళ్లకు ప్రధాన సూత్రధారి దావూద్. 1993 మార్చి 12న ముంబైలో జరిగిన 12 వరుస పేలుళ్ళలో దాదాపు 250 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుళ్లలో గాయపడినవారు తీవ్రంగా నష్టపోయారు. బాధితుల కుటుంబాలు ఇప్పటికీ ఆ దుఃఖం నుంచి తేరుకోలేకపోతున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2003లో దావూద్ తలకు 25 మిలియన్ డాలర్లు వెల కట్టింది. ఆయన గురించి సమాచారం తెలిపినవారికి ఈ సొమ్మును బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. భారత దేశానికి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఆయన ఒకడు.

దావూద్ నేర సామ్రాజ్యం ముంబై నుంచి ప్రారంభమైంది. దోపిడీలు, కాంట్రాక్ట్ హత్యలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల అక్రమ రవాణా వంటివాటితో విజృంభించి, బాలీవుడ్ సినిమాల్లో పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత అతని నేర సామ్రాజ్యం పాకిస్థాన్, దుబాయ్, గల్ఫ్ దేశాలకు విస్తరించింది. 1993లో ముంబైలో వరుస పేలుళ్లకు ముందు ఆయన పాకిస్థాన్‌కు పారిపోయాడు. కొంత కాలం వేచి చూసిన తర్వాత ఇతర దేశాలకు వెళ్లడం, ఆస్తులు కొనడం ప్రారంభించాడు. క్రికెట్ మ్యాచ్‌లను ముందు వరుసలో కూర్చుని చూసే స్థాయిలో ఆయనకు పాకిస్థాన్ ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. భారత దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం ఆయనను పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) వాడుకుంది. పాకిస్థానీ సమాజంలో దావూద్ బాగా కలిసిపోయాడు. ఆయన కుమార్తెను ప్రముఖ క్రికెటర్ జావేద్ మియాందాద్ కుమారునికి ఇచ్చి పెళ్లి చేశాడు.

దావూద్ భారత దేశానికి రావడానికి సుముఖంగా ఉన్నాడని 2018లో ప్రముఖ క్రిమినల్ లాయర్ శ్యామ్ కేశ్వానీ చెప్పారు. అయితే ఆయన విధించిన షరతులను భారత ప్రభుత్వం అంగీకరించలేదని చెప్పారు. దావూద్ తాను చేసిన నేరాలకు భారత దేశంలో విచారణను, శిక్షను ఎదుర్కొనబోడని బాధితులంతా నిరాశ చెందుతున్నారు. 2014లో అప్పటి బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ఓ గుజరాతీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దావూద్‌ను భారత దేశానికి భారత ప్రభుత్వం ఎందుకు రప్పించలేకపోతోందని ప్రశ్నించారు. దీనిపై 2014 ఏప్రిల్ 27న అప్పటి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ, దావూద్ పాకిస్థాన్‌లో ఉన్నట్లు చెప్తున్నారని, ఆయనను భారత దేశానికి రప్పించేందుకు అమెరికాతో కలిసి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం మాట్లాడుతూ, వేరొక ప్రభుత్వం కాపాడుతున్న వ్యక్తిని ఏ విధంగా తీసుకురాగలమని ప్రశ్నించారు. చట్టవిరుద్ధమైన, రహస్య కార్యకలాపాలకు మనం పాల్పడలేమన్నారు. ఆ పని చేయడానికి మోదీ ఏ విధంగా ప్రణాళిక రచిస్తారని ప్రశ్నించారు.

ఆ తర్వాత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. 2015 మే 5న ఆయన ప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడో ప్రభుత్వానికి తెలియదని చెప్పింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఆ మర్నాడు మాట మార్చి, దావూద్ పాకిస్థాన్‌లో ఉన్నాడని చెప్పింది. ఆయనను రప్పించేందుకు ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తుందని చెప్పింది. ఐదు రోజుల తర్వాత అంటే 2015 మే 11న అప్పటి హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో చేసిన ప్రకటనలో, పాకిస్థాన్‌కు నచ్చజెప్పడమైనా, ఒత్తిడి చేయడమైనా, దావూద్ ఇబ్రహీంను రప్పించే వరకు విశ్రమించబోమని చెప్పారు.

2016 మే 24న రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన ప్రకటనలో, దావూద్‌ను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఏవిధంగానైనా ఆయనను రప్పిస్తామన్నారు. ఆయన అంతర్జాతీయ ఉగ్రవాది అని, ఆయనను పట్టుకోవడం కోసం అంతర్జాతీయ సంస్థల సహాయం తీసుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. 2017 ఫిబ్రవరి 4న కూడా రాజ్‌నాథ్ సింగ్ ఇదే విధంగా ఓ ప్రకటన ఇచ్చారు. దావూద్‌ పాకిస్థాన్‌లో ఉన్నాడని, ఆయనను పట్టుకోవడానికి కాస్త సమయం పడుతుందని చెప్పారు.

మోదీ గెలుపుతో భయపడిన దావూద్!

ఇదిలావుండగా, 2019లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో దావూద్ తీవ్ర ఆందోళనకు గురైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతకుముందు మోదీ ప్రభుత్వం తనపైనా, తన సహచరులపైనా కఠినంగా వ్యవహరించిన విషయాన్ని దావూద్ గుర్తు చేసుకున్నాడని, తన భయాందోళనలను పాకిస్థాన్ ఆర్మీ అధికారుల వద్ద చెప్పుకున్నాడన్నది ఆ వార్తల సారాంశం.

ఇవి కూడా చదవండి :

Jada Shravan Kumar: ఆర్‌-5జోన్‌పై సుప్రీంలో రైతుల పిటిషన్.. ఇంప్లీడ్ కానున్న జడ శ్రవణ్

Bajrang Dal Ban : హిందూ సంస్థలపై నిషేధాలు.. భావోద్వేగ రాజకీయాలు..

Updated Date - 2023-05-06T13:50:41+05:30 IST