Share News

Himanta Biswa Sarma: ముస్లిం ఓట్లపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-11-04T21:55:56+05:30 IST

హిందూ-ముస్లిం వ్యవహారంలో నిరంతరం సంచలన వ్యాఖ్యలు చేసే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. ఇప్పుడు తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను ‘మియా ముస్లిం’ల..

Himanta Biswa Sarma: ముస్లిం ఓట్లపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు

హిందూ-ముస్లిం వ్యవహారంలో నిరంతరం సంచలన వ్యాఖ్యలు చేసే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. ఇప్పుడు తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను ‘మియా ముస్లిం’ల (మియా అనేది బెంగాలీ మూలం ముస్లిములకు ఉపయోగించే అవమానకరమైన పదం) నుంచి ఓట్లు ఆశించడం లేదని కుండబద్దలు కొట్టారు. మియా ముస్లిములు పెద్ద సంఖ్యలో చికిత్స పొందుతున్నారనన కారణంతోనే తాను మెడికల్ కాలేజీలను సందర్శించడం లేదని తెలిపారు. అంతేకాదు.. కాంగ్రెస్‌, ఆల్‌ ఇండియా యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఏఐయూడీఎఫ్‌) ఏళ్ల తరబడి భయానక వాతావరణం సృష్టించి.. ఇక్కడి ముస్లింల నుంచి ఓట్లు అడిగారని ఆరోపించారు.


గౌహాతీలో మీడియా సమావేశంలో హిమంత మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్ పార్టీలు వలస మూలాల ముస్లింల నుండి ఓట్లు అడిగారు. కానీ వారి అభివృద్ధికి వాళ్లేమీ చేయలేదు. వారి ప్రాంతాల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రోడ్లు, వంతెనలు, పాఠశాలలు, కళాశాలలు వంటివేవీ నిర్మించలేదు’’ అని పేర్కొన్నారు. ప్రతి మెడికల్ కాలేజీలో స్థానిక యువత కన్నా.. మియా ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉండటం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను ఇకపై ఈ కాలేజీలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. అయితే.. స్థానిక అస్సామీ ముస్లింల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నామన్నారు. త్వరలో వారిపై కూడా సర్వే నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని స్థానిక ముస్లింల అభివృద్ధిపై తాను, తన పార్టీ (బీజేపీ) ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు.

‘మియా ముస్లిం’లు అన్ని రంగాల్లో ఉన్నారనేది నిజమేనని, ఇది అస్సామీ యువతకు గుణపాఠం కావాలని హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఈ కమ్యూనిటీకి చెందిన యువత.. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్, ఇంజినీరింగ్, ఇతర విద్యాసంస్థల్లో అడ్మిషన్ తీసుకుంటున్నారన్న విషయం తమకు తెలుసన్నారు. అయితే.. ఇతర విద్యార్థుల తరహాలోనే వాళ్లు కూడా పరీక్ష పోటీల్లో పాల్గొని ప్రవేశం పొందుతున్నారని, కాబట్టి ఈ వ్యవహారంలో ఏమీ చేయలేమన్నారు. మరోవైపు.. సీఎం హిమంతపై ఏఐయూడీఎఫ్ చీఫ్ మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ ఎదురుదాడికి దిగారు. అస్సాంలో మియాన్ ముస్లింలు పనిచేయడం మానేస్తే గౌహతి ఎడారిగా మారుతుందని, గౌహాతిలో మూడు రోజులు పని చేయకపోతే అది శ్మశాన వాటికగా తయారవుతుందని పేర్కొన్నారు.

Updated Date - 2023-11-04T21:55:57+05:30 IST