Himachal pradesh: మంత్రివర్గ విస్తరణ, విక్రమాదిత్య సహా ఏడుగురికి చోటు

ABN , First Publish Date - 2023-01-08T14:18:07+05:30 IST

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మరో ఏడుగురిని తన మంత్రివర్గంలోకి..

Himachal pradesh: మంత్రివర్గ విస్తరణ, విక్రమాదిత్య సహా ఏడుగురికి చోటు

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు (Sukhvinder Singh Sukhu) తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మరో ఏడుగురిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో హిమాచల్ కేబినెట్ సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది. కొత్తగా క్యాబినెట్‌లోకి తీసుకున్న మంత్రులతో గవర్నర్ రాజేంద్ర విశ్వానాథ్ ఆర్లేకర్ సిమ్లాలోని రాజ్‌భవన్‌లో ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రమాణస్వీకారం చేయించారు. డిసెంబర్ 11న సుఖ్వీందర్ సింగ్, ఆయన డిప్యూటీగా ముఖేష్ అగ్నిహోత్రి మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో సహా హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్‌ సభ్యుల సంఖ్య 12కు మించరాదు.

కొత్త మంత్రులు వీరే...

కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేసిన ఏడుగురిలో సోలాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే ధని రామ్ శాండిల్, కాంగ్రా జిల్లా జవాలి నియోజకవర్గం ఎమ్మెల్యే చందర్ కుమార్, సిర్‌మౌర్ జిల్లా షిల్లాయ్ నియోజకవర్గం ఎమ్మెల్యే హర్షవర్దన్ చౌహాన్, గిరిజన కన్నూరు జిల్లాకు చెందిన జగత్ సింగ్, జుబ్బల్-కొట్కాయ్ జిల్లా ఎమ్మెల్యే రోహిత్ ఠాకూర్, కసుంప్టి నియోజకవర్గం ఎమ్మెల్యే అనిరుధ్ సింగ్, సిమ్లా రూరల్ ఎమ్మెల్యేల విక్రమాదిత్య సింగ్ ఉన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చేతిలో ఆర్థిక, జనరల్ అడ్మినిస్ట్రేషన్, హోం, ప్లానింగ్, పర్సనల్, ఇతర శాఖలు ఉండగా, ఉప ముఖ్యమంత్రి అగ్నిహోత్రి చేతిలో జల్ శక్తి విభాగ్, రవాణా, భాష, కళలు, సాంస్కృతిక శాఖలు ఉన్నాయి. ఇటీవల జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 68 స్థానాలకు గాను 40 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది.

Updated Date - 2023-01-08T14:18:09+05:30 IST