Vadodara Violence: వడోదర అల్లర్లపై 'సిట్' దర్యాప్తు

ABN , First Publish Date - 2023-04-01T16:20:45+05:30 IST

శ్రీరామ నవమి శోభాయాత్రం సందర్భంగా వడోదరలో చెలరేగిన అల్లర్లపై దర్యాప్తు జరిపేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్..

Vadodara Violence: వడోదర అల్లర్లపై 'సిట్' దర్యాప్తు

గాంధీనగర్: శ్రీరామ నవమి శోభాయాత్రం సందర్భంగా వడోదరలో (Vadogara) చెలరేగిన అల్లర్లపై దర్యాప్తు జరిపేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఏర్పటయింది. క్రైమ్ విభాగం డీసీపీ సారథ్యంలోని ఐదుగురు సభ్యులతో కూడిన పోలీసు టీమ్‌ ఈ సిట్‌లో ఉంటుంది. గుజరాత్‌లోని వడోదర సిటీ కుంభద్వార-హాథిఖానా ప్రాంతంలో మార్చి 30న శోభాయాత్ర సందర్భంగా రాళ్లు రువ్వుడు ఘటన చోటుచేసుకుని తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. అల్లర్లను ప్రేరేపించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న 23 మందిని వడోదర పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్ల ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు ఈ అరెస్టులు చేశారు.

వడోదరలో అల్లర్లకు సంబంధించిన కేసులో ఐదుగురు మహిళలతో సహా 23 మందిని అరెస్టు చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ 23 మందిలో ఐదుగురిని వడోదరలోని స్థానిక కోర్టు పోలీసు రిమాండ్‌కు పంపగా, 19 మందిని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.

భారీగా బలగాల మోహరింపు

మార్చి 30న రాళ్లు రువ్వుడు ఘటనలు చోటుచేసున్న అనంతరం ఆ రాత్రంతా వడోదర సిటీ పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అల్లర్లు విస్తరించకుండా చూసేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు 400 మంది సిబ్బందితో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్టు వడోదర జాయింట్ పోలీస్ కమిషనర్ మనోజ్ నినామా తెలిపారు. ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు, మెడికల్ పరీక్షల అనంతరం 23 మందిని అరెస్టు చేశామని, మరో 22 మందికి ప్రమేయమున్నట్టు గుర్తించామని చెప్పారు. అదనంగా 500 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. కాగా, మైనారిటీల ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో శోభాయాత్ర వెళ్తుండగా అల్లర్లు చెలరేగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Updated Date - 2023-04-01T16:20:45+05:30 IST