Governor: ఆ బిల్లుపై ఈసారైనా సంతకం చేస్తారా?

ABN , First Publish Date - 2023-03-26T10:30:08+05:30 IST

రెండోసారి శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించిన ఆన్‌లైన్‌ రమ్మీ(Online Rummy) నిషేధ చట్టం బిల్లుపై సంతకం చేసే వి

Governor: ఆ బిల్లుపై ఈసారైనా సంతకం చేస్తారా?

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రెండోసారి శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించిన ఆన్‌లైన్‌ రమ్మీ(Online Rummy) నిషేధ చట్టం బిల్లుపై సంతకం చేసే విషయమై రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. శుక్రవారం ఉదయం రాష్ట్ర న్యాయశాఖ ఉన్నతాధికారుల రాజ్‌భవన్‌కు వెళ్ళి ఎనిమిది పేజీల ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధచట్టం బిల్లును అక్కడి ఉన్నతాధికారులకు అందజేశారు. అదేరోజు రాత్రి ఢిల్లీ పర్యటనను ముగించుకుని నగరానికి తిరిగొచ్చిన గవర్నర్‌ రవి ఆ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ బిల్లుకు సంబంధించి గవర్నర్‌ గతంలో లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన వివరాలను జతచేసినట్లు తెలుస్తోంది. శాసనసభలో రెండోసారి ఆమోదించిన బిల్లును రాజ్యాంగ ధర్మాసన చట్టం ప్రకారం తిరస్కరించే వీలులేదని న్యాయశాఖ మంత్రి రఘుపతి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఢిల్లీలో గవర్నర్‌ రవి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah)ను కలుసుకున్నప్పుడు ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టం బిల్లు విషయాన్ని ప్రస్తావించినట్లు చెబుతున్నారు. అమిత్‌షా ఆ విషయమై గవర్నర్‌కు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టం బిల్లును గవర్నర్‌ తిరస్కరించేందుకు వీలులేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఈ విషయమై గవర్నర్‌ రెండు నిర్ణయాలను మాత్రమే తీసుకోగలుగుతారని చెబుతున్నారు. ఆ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేయడం, లేదా బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం మాత్రమే గవర్నర్‌ ముందున్న మార్గాలని గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ రమ్మీ నిషేఽధ చట్టం అమలులో ఉండటం వల్ల ఈ బిల్లును రాష్ట్రపతికి ఎట్టి పరిస్థితులలోనూ పంపరని మరికొందరు న్యాయశాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే సమయంలో బిల్లుపై వెనువెంటనే సంతకం చేయకుండా గవర్నర్‌ ఒకటి రెండు మాసాలపాటు పెండింగ్‌లో ఉంచి, ఆ తర్వాత సంతకం చేస్తారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - 2023-03-26T10:30:08+05:30 IST