Film director: సినీ దర్శకుడికి మళ్లీ సమన్లు.. విషయం ఏంటంటే...
ABN , First Publish Date - 2023-09-15T07:11:12+05:30 IST
‘నామ్ తమిళర్ కట్చి’ నాయకుడు, సినీ దర్శకుడు సీమాన్(Seeman is the film director)కు వలసరవాక్కం పోలీసులు మళ్లీ సమన్లు జారీ చేశారు.
- విజయలక్ష్మిపై పరువు నష్టం దావా
చెన్నై, (ఆంధ్రజ్యోతి): ‘నామ్ తమిళర్ కట్చి’ నాయకుడు, సినీ దర్శకుడు సీమాన్(Seeman is the film director)కు వలసరవాక్కం పోలీసులు మళ్లీ సమన్లు జారీ చేశారు. పెళ్ళి చేసుకుంటానని తనను మోసం చేసాడంటూ నటి విజయలక్ష్మి(Actress Vijayalakshmi), ఆమె సన్నిహితురాలు వీరలక్ష్మి చేసిన ఫిర్యాదు మేరకు వలసరవాక్కం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు హాజరుకావాలని పోలీసులు ఇటీవల సీమాన్‌కు సమన్లు పంపినా ఆయన హాజరుకాలేదు. దీంతో గురువారం ఉదయం మళ్ళీ ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో వలసరవాక్కం పోలీసుస్టేషన్‌లో తాను విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమేనని ప్రకటించిన సీమాన్ పోలీసులకు కొన్ని షరతులు విధించారు. పోలీసుస్టేషన్‌లో విచారణ జరుపుతున్నప్పుడు విజయలక్ష్మి, వీరలక్ష్మి కూడా తన ఎదురంగా ఉండాలన్నారు. పార్టీ పరంగా తాను వివిధ ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉందని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అందుకు తగినట్లు పోలీసులు విచారణ ముగించాలని కూడా నిబంధన విధించినట్లు తెలిసింది.
క్షమాపణలు చెప్పాలి...
తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న నటి విజయలక్ష్మి బేషరతుగా క్షమాపణ తెలపాలని కోరుతూ సీమాన్ తరఫు న్యాయవాది నోటీసులు పంపించారు. విజయలక్ష్మి క్షమాపణ చెప్పకుంటే రూ. కోటి నష్టపరిహారంగా చెల్లించాలని పరువునష్టం దావా వేస్తానని ఆ నోటీసులో హెచ్చరించారు. 15 రోజుల్లోగా విజయలక్ష్మి, వీరలక్ష్మి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సీమాన్ అనుచరుల బెదిరింపు: విజయలక్ష్మి ఫిర్యాదు
నామ్ తమిళర్ కట్చి నాయకులు తనను బెదిరిస్తున్నారంటూ నటి విజయలక్ష్మి గురువారం పోలీసు కమిషనర్ కార్యాలయంలో మళ్లీ ఫిర్యాదు చేశారు. విజయలక్ష్మి కమిషనర్ కార్యాలయానికి వస్తున్నట్లు తెలుసుకున్న నామ్ తమిళర్ కట్చి కార్యకర్తలు కొందరు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయలక్ష్మి కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో నామ్ తమిళర్ కట్చి నేతలు, కార్యకర్తల నుంచి రోజురోజుకూ బెదిరింపులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.