సీఎంకు సన్నిహితుడిగా ఉన్నా.. మంత్రి పదవికి ఎసరు వచ్చిందేంటో..

ABN , First Publish Date - 2023-05-11T08:57:42+05:30 IST

ముఖ్యమంత్రి (Chief Minister )కి సన్నిహితుడిగా పేరుగాంచిన పాడిపరిశ్రమల శాఖ మంత్రి పదవి నుంచి

సీఎంకు సన్నిహితుడిగా ఉన్నా.. మంత్రి పదవికి ఎసరు వచ్చిందేంటో..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin)కు సన్నిహితుడిగా పేరుగాంచిన పాడిపరిశ్రమల శాఖ మంత్రి పదవి నుంచి ఆవడి నాజర్‌(Nazar)ను తప్పించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పాల ఉత్పత్తి రంగ సంస్థ ఆవిన్‌లో నెలకొన్న అవకతవకలే ఆయన పదవికి ఎసరు పెట్టినట్లు ఆయన సన్నిహితులు వాపోతున్నారు. ఆవడి నాజర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు చిరకాల మిత్రుడు. స్టాలిన్‌ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాజర్‌ కూడా ఆ విభాగంలో ఉంటూ పార్టీకి విశిష్ట సేవలందించారు. ఆయనకు విశ్వాసపాత్రుడిగా పేరు తెచ్చుకున్నారు. కనుకనే ఆయనకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. అయితే నాజర్‌ తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయారని డీఎంకే వర్గాలే చెబుతు న్నాయి. పాడిపరిశ్రమ అభివృద్ధిపై దృష్టి సారించకుండా, పాల సహకార సంఘాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. వీటన్నింటికి తోడు ప్రజలను ప్రతినిత్యం పాలప్యాకెట్లను సరఫరా చేసే ఆవిన్‌ సంస్థలో అవకతవకలు జరిగినా ఆయన పట్టించుకోలేదని సీఎంకు ఆధారాలతో సమాచారం అందింది. ఆయన హయాంలో వివిధ ప్రాంతాల నుంచి పాలసేకరణ కూడా కష్టతరంగా మారినట్లు ఆరోపణలున్నాయి. ఆ మధ్య నగరంలో పాల ప్యాకెట్లు సకాలంలో సరఫరా కాకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. వీటన్నింటినీ చక్కదిద్దాల్సిన నాజర్‌.. ఆ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకున్నారు. వీటన్నింటినీ సీఎం సునిశితంగా గమనించినట్లు డీఎంకే వర్గాలు చెబుతున్నాయి.

nani3.jpgఅందుకే మంత్రివర్గంలో మార్పు అనగానే ముందుగా నాజర్‌ పేరే జాబితాలో కనిపించింది. అదే సమయంలో నాజర్‌ కుమారుడు ఆశీంరాజా తండ్రి విధుల్లో జోక్యం చేసుకునేవారన్న ఆరోపణలున్నాయి. డీఎంకే(DMK) ఆవడి కార్యదర్శిగా, కార్పొరేషన్‌ నాలుగోవార్డు కౌన్సిలర్‌గా ఉన్న ఆశీంరాజా.. టెండర్ల వ్యవహారంలో జోక్యం చేసుకునే వారని తెలుస్తోంది. అంతేకాకుండా ఆవడి ఐదో పోలీసు బెటాలియన్‌కు చెందిన స్థలాన్ని ఆక్రమించుకుని పార్టీ జెండా ఎగరేసి డీఎంకేకి చెడ్డపేరు తెచ్చారని స్థానిక నాయకుల నుంచి స్టాలిన్‌కు ఫిర్యాదులందాయి. దీనికి తోడు ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తనకు వెంటనే కుర్చీ తెచ్చివ్వలేదన్న కోపంతో ఓ కార్యకర్తపై నాజర్‌ రాయి విసిరిన దృశ్యాలు దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్నాయి. డీఎంకే వర్గాలు సైతం ఈ వ్యవహారంలో నాజర్‌ తీరును తప్పుబట్టాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే సీఎం నాజర్‌పై వేటు వేసినట్లు డీఎంకే వర్గాలు వివరిస్తున్నాయి.

Updated Date - 2023-05-11T08:57:42+05:30 IST