Amritpal Surrender: అమృత్‌పాల్ లొంగిపోయాడా?.. పోలీసుల వివరణ ఏమిటంటే..!

ABN , First Publish Date - 2023-04-07T12:07:50+05:30 IST

పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ అనుకూల నేత, ర్యాడికల్ ప్రీచర్ అమృత్‌‌పాల్ సింగ్ ..

Amritpal Surrender: అమృత్‌పాల్ లొంగిపోయాడా?.. పోలీసుల వివరణ ఏమిటంటే..!

చండీగఢ్: పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ అనుకూల నేత, ర్యాడికల్ ప్రీచర్ అమృత్‌‌పాల్ సింగ్ (Amritpal Singh) లొంగిపోయాడా? దీనిపై వస్తున్న వదంతులపై పంజాబ్ పోలీసులు శుక్రవారంనాడు స్పందించారు. ఇలాంటి వదంతులను నమ్మవద్దని కోరారు. ఇది పూర్తిగా తప్పుడు సమాచారమని, ఇలాంటి వార్తలను షేర్ చేసేముందు నిజానిజాలు నిర్ధారణ చేసుకోవాలని పంజాబ్ పోలీసులు ఒక ట్వీట్‌లో వివరమ ఇచ్చారు.

'వారిస్ పంజాద్ దే' చీఫ్ అమృత్‌పాల్ గత మార్చి 18 నుంచి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాయి. అతని కోసం పోలీసు బృందాలు విస్తృతంగా గాలింపు జరుపుతున్నాయి. ఈ క్రమంలో అమృత్‌సర్ స్వర్ణాలయం వద్ద అమృత్‌పాల్ లొంగిపోవచ్చంటూ ఊహాగానాలు వినిపించాయి. దీనిపై శాంతిభద్రతల విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పర్మీందర్ సింగ్ గత శనివారం స్పందిస్తూ, లొంగిపోవాలని కోరుకుంటే చట్టప్రకారం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అమృత్‌సర్ ప్రజల భద్రత కోసం తాము నిరంతరం పనిచేస్తుంటామని, లొంగిపోవాలని అమృత్‌పాల్ కోరుకుంటే చట్టప్రకారం అతనికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

దీనికి ముందు, అమృత్‌పాల్ ఒక వీడియోలో తాను తప్పించుకుని తిరగడం లేదని, త్వరలో ప్రపంచం ముందుకు వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ఆ వీడియో ఆయనదా కాదా అనే నిర్ధారణ మాత్రం జరగలేదు. గత ఫిబ్రవరి 23వ తేదీన అంజలా పోలీస్ స్టేషన్‌పై అమృత్‌పాల్ మద్దతుదారులు కొందరు దాడి చేసిన నేపథ్యంలో అమృత్‌పాల్ కోసం మూడు వారాల క్రితం పోలీసులు గాలింపు జరిపారు. ఈ గాలింపుల్లో దొరికినట్టే దొరికి, తన మద్దతుదారులతో సహా ఆయన తప్పించుకుని పారిపోయాడు.

Updated Date - 2023-04-07T12:07:50+05:30 IST