Share News

DMK MP: డీఎంకే ఎంపీ సంచలన కామెంట్స్.. ఎల్టీటీఈ ప్రభాకరన్‌ జాతీయ నేత!

ABN , First Publish Date - 2023-11-29T07:55:35+05:30 IST

శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్‌(Velupillai Prabhakaran) గౌరవించ దగ్గ జాతీయనేత అంటూ డీఎంకే లోక్‌సభ సభ్యురాలు

DMK MP: డీఎంకే ఎంపీ సంచలన కామెంట్స్.. ఎల్టీటీఈ ప్రభాకరన్‌ జాతీయ నేత!

- డీఎంకే ఎంపీ తమిళచ్చి పొగడ్త

- మండిపడ్డ కాంగ్రెస్‌, బీజేపీ నేతలు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్‌(Velupillai Prabhakaran) గౌరవించ దగ్గ జాతీయనేత అంటూ డీఎంకే లోక్‌సభ సభ్యురాలు తమిళచ్చి తంగపాండ్యన్‌(Tamilachi Thangapandian) చేసిన పొగడ్తలు కాంగ్రెస్‌, బీజేపీ శ్రేణులకు మంటపుట్టించాయి. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకు ప్రధాన కారకుడైన ప్రభాకరన్‌ను ఇలా కీర్తించడం న్యాయమేనా? అంటూ కాంగ్రెస్‌ నేతలు ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇదే విధంగా బీజేపీ నేతలు కూడా మాజీ ప్రధాని రాజీవ్‌ హంతకుడిని పొగడటం గర్హనీయమని, ఇకనైనా డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్‌ వైదొలగటమే మంచిదని వ్యాఖ్యానించారు. ప్రభాకరన్‌ జయంతి సందర్భంగా సోమవారం తమిళచ్చి తంగపాండ్యన్‌ ఓ ఆంగ్ల పత్రిక వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగా ప్రపంచ స్థాయిలో పేరుపొందిన ఏ నాయకుడిని కలుసుకుని విందారగిస్తారని ఓ విలేకరి తమిళచ్చి తంగపాండ్యన్‌ను ప్రశ్నించారు. వెంటనే ఆమె తడుముకోకుండా గౌరవనీయులైన జాతీయ నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్‌ను కలుసుకుని ఆయనతో విందారగిస్తానని సమాధానమిచ్చారు. అంతటితో ఆగకుండా ప్రభాకరన్‌ను కలుసుకోవడం సంభవిస్తే ముళ్లివాయక్కాల్‌ (శ్రీలంకలో తమిళ ఈలమ్‌ చివరి దశ పోరు జరిగిన ప్రాంతం) మారణకాండకు క్షమాపణలు చెబుతానని తమిళచ్చి పేర్కొన్నారు.

nani4.2.jpg

ఇలా తమిళచ్చి తంగపాండ్యన్‌ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్‌ నాయకులకు, బీజేపీ నాయకులకు మంటపుట్టించాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌ కుమారమంగళం, ఎంపీ కార్తీక్‌ చిదంబరం వేర్వేరు ప్రకటనల్లో తమిళచ్చి తంగపాండ్యన్‌పై ధ్వజమెత్తారు. మోహన్‌కుమార్‌మంగళం జారీ చేసిన ప్రకటనలో మాజీ ప్రధానిని అత్యంత దారుణంగా హతమార్చేందుకు కారణమైన ప్రభాకరన్‌ను జాతీయ నాయకుడంటూ పొగడం గర్హనీయమని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉంటూ ఇలా హంతకుడిని నాయకుడిగా కీర్తించడం సమంజసమేనా అని ప్రశ్నించారు. మాజీ ప్రధాని రాజీవ్‌తోపాటు 17 మంది తమిళులు కూడా హతమైన విషయాన్ని కూడా ఆమె మరచినట్లుందని తెలిపారు. డీపీఐ నేత వన్నియరసు స్పందిస్తూ... ప్రభాకరన్‌కు మద్దతిస్తే హిందుత్వానికి వ్యతిరేకమని అన్నారు. బీజేపీ డిప్యూటీ అధ్యక్షుడు నారాయణన్‌ తిరుపతి వ్యాఖ్యానిస్తూ ఎంపీ తమిళచ్చి తంగపాండ్యన్‌ ప్రకటన మేరకు ముళ్లివాయక్కాల్‌ మారణకాండకు డీఎంకే ప్రధాన కారణమని స్పష్టమవుతోందన్నారు. ప్రభాకరన్‌ను జాతీయ నాయకుడిగా కీర్తించడం డీఎంకేకు ఉన్న గర్వాన్నే చాటుతోందని ఆయన విమర్శించారు.

Updated Date - 2023-11-29T07:55:36+05:30 IST