Share News

DK Shivakumar: కుమారస్వామి ‘అశ్లీల’ వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన డీకే శివకుమార్.. నిరూపిస్తే తప్పుకుంటానంటూ సవాల్

ABN , First Publish Date - 2023-11-21T21:07:45+05:30 IST

కర్ణాటక రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ముఖ్యంగా.. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తరచూ ఆరోపణలు చేస్తూ, అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే...

DK Shivakumar: కుమారస్వామి ‘అశ్లీల’ వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన డీకే శివకుమార్.. నిరూపిస్తే తప్పుకుంటానంటూ సవాల్

కర్ణాటక రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ముఖ్యంగా.. మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తరచూ ఆరోపణలు చేస్తూ, అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన డిప్యూటీ సీఎం శివకుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తనకు చెందిన టూరింగ్ టాకీసుల్లో శివకుమార్ ‘అశ్లీల సినిమాలు’ ప్రదర్శించారని ఆరోపించారు. దీంతో.. శివకుమార్, కుమారస్వామి మధ్య మాటల యుద్ధం మొదలైంది. కుమారస్వామి చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని తోసిపుచ్చిన శివకుమార్.. ఆ ఆరోపణల్ని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ కూడా విసిరారు.


ఇటీవల డీకే శివకుమార్‌ని టార్గెట్ చేస్తూ.. దొడ్డలహళ్లి, కనకపురలోని సాథనూర్‌లో ఆయన నడిపిన సినిమా థియేటర్లలో ‘అశ్లీల సినిమాలు’ ప్రదర్శించారని కుమారస్వామి ఆరోపించారు. తాజాగా కూడా మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేశారు. తన పేరుతో ఇటీవల పోస్టర్లు అంటించడంతో.. ‘గతంలో తనకు చెందిన థియేటర్లలో అశ్లీల సినిమాల్ని ప్రదర్శించిన వ్యక్తి తీరు ఇలాగే ఉంటుందని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తిని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారని, కాంగ్రెస్ వారికి అధికారం కట్టబెట్టిందని మండిపడ్డారు. అయితే.. కుమారస్వామి ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని, తాను ఎన్నికల్లో ఓడిపోయానన్న బాధలో ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని తిప్పికొట్టారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనకపుర ప్రజలు తనని 1.23 లక్షల ఓట్ల ఆధిక్యతతో ఎన్నుకున్నారని, ఇది కర్ణాటకలోనే రికార్డ్ ఫలితాలని చెప్పుకొచ్చారు.

తాను నిజంగానే అశ్లీల సినిమాల్ని ప్రదర్శించి ఉంటే.. గతంలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో తనలాంటి వ్యక్తిని కేబినెట్‌లో ఎందుకు తీసుకున్నారని డీకే శివకుమార్ ప్రశ్నించారు. తాను అశ్లీల సినిమాల్ని ప్రదర్శించానా? లేదా? అనే విషయాన్ని కనకపురకు వెళ్లి అక్కడి ప్రజల్ని అడగాలన్నారు. ఒకవేళ తాను అశ్లీల సినిమాల్ని ప్రదర్శించినట్టు నిరూపిస్తే.. రాజకీయాల నుండి నిష్క్రమించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని, ఆయనలా మాటలు మాట్లాడకూడదని సూచించారు. ఈ థియేటర్ తన పేరు మీదే ఉందని, ఇందిరా గాంధీ జ్ఞాపకార్థం దీనిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తాను థియేటర్ షోలను నడుపుతున్నానని.. తాను చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని వివరణ ఇచ్చారు.

Updated Date - 2023-11-21T21:07:46+05:30 IST