MCD Polls: ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా

ABN , First Publish Date - 2023-02-13T18:26:15+05:30 IST

న్యూఢిల్లీ: షెడ్యూల్ ప్రకారం ఈనెల 16న జరగాల్సిన ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఇందుకు సంబంధించిన కేసు విచారణను వచ్చే 17వ తేదీ శుక్రవారానికి..

MCD Polls: ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా

న్యూఢిల్లీ: షెడ్యూల్ ప్రకారం ఈనెల 16న జరగాల్సిన ఢిల్లీ మేయర్ ఎన్నిక (Delhi Mayor Election) మరోసారి వాయిదా పడింది. ఇందుకు సంబంధించిన కేసు విచారణను వచ్చే 17వ తేదీ శుక్రవారానికి సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. దీంతో ముందస్తు తేదీ కూడా వాయిదా పడింది.

దీనికి ముందు, ఈనెల 16న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులకు ఓటింగ్ హక్కు కల్పి్స్తూ ఎల్జీ తీసుకున్న నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై సీజేఐ డివై చంద్రచూడ్ సారథ్యంలోని బెంచ్ విచారణను ఈనెల 17కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ''అమెరికా న్యాయమూర్తుల ప్రతినిధి బృందంతో మేము సమావేశం కావాల్సి ఉంది. ఆ కారణంగా కేసు విచారణను శుక్రవారం చేపడతాం'' అని సీజేఐ ప్రకటించారు. కాగా, విచారణ జరిగేంత వరకూ ఎంసీడీ మేయర్ ఎన్నికలను వాయిదా వేయాలని సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై ఎల్జీ కార్యాలయం స్పందించింది. ఫిబ్రవరి 16వ తేదీన అనుకున్న మేయర్ ఎన్నికలను 17వ తేదీ తర్వాత ప్రకటిస్తామని తెలిపింది.

కాగా, ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్, ఎంసీడీ ఆరుగురు స్టాడింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక మూడుసార్లు సభా సమావేశాలు జరిగినా రసాభాస కావడంతో వాయిదా పడ్డాయి. తొలి సమావేశం జనవరి 6, రెండో సమావేశం జనవరి 24, మూడో సమావేశం ఫిబ్రవరి 6న జరిగింది. ఎల్జీ నామినేట్ చేసిన 10 మంది సభ్యులను ఓటింగ్‌కు అనుమతించాన్ని ఆప్ వ్యతిరేకించడంతో గందరగోళ పరిస్థితుల మధ్య ఎన్నికలు చోటుచేసుకోలేదు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ 134 వార్డులు గెలుచుకుని విజేతగా నిలవగా, బీజేపీ 104 వార్డులు, కాంగ్రెస్ 9 వార్డులు గెలుచుకుంది. 15 ఏళ్ల పాటు ఎంసీడీని పాలించిన బీజేపీ ఈసారి కూడా తమ అభ్యర్థినే మేయర్‌గా చేయాలని వ్యూహరచన చేస్తుండగా, అత్యధిక సీట్లు గెలుచుకున్న తమకే కీలకమైన మేయర్, డిప్యూటీ మేయర్ పదవి దక్కాలని ఆప్ పట్టుదలగా ఉంది. సంఖ్యాబలం ఆధారంగా కీలకమైన ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల్లో 3 ఆప్ గెలుచుకునే అవకాశం ఉండగా, రెండు బీజేపీ గెలుచుకునే వీలుంది. దీంతో ఆరో అభ్యర్థి ఎన్నిక కీలకంగా మారింది. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కు ఉంటే బీజేపీ గెలుపు నల్లేరుమీద నడకే కానుందని ఆప్ ఆందోళనగా ఉంది.

Updated Date - 2023-02-13T18:26:17+05:30 IST