Centre Ordinance: కేంద్రం ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేసిన 'ఆప్'
ABN , First Publish Date - 2023-06-30T19:05:05+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో శుక్రవారంనాడు సవాలు చేసింది. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగవిరుద్ధమని పేర్కొంది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ (Centre ordinance)ను ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం సుప్రీంకోర్టు(Supreme court)లో శుక్రవారంనాడు సవాలు చేసింది. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగవిరుద్ధమని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 239ఏఏ ప్రకారం ఎన్నికైన ప్రభుత్వానికి ఉన్న అధికారాలను ఎన్నికకాని ఎల్జీ చేతుల్లోకి తీసుకువచ్చేలా ఎలాంటి సవారణ చేయరాదని ఆ పిటిషన్‌లో ఆప్ సర్కార్ పేర్కొంది.
దేశరాజధానిలోని ఐఏఎస్, డీఏఎన్‌ఐసీఎస్ అధికారుల బదిలీలు, నియామకాల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు వర్తింపజేస్తూ మే 19న కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. సుప్రీంకోర్టు గత ఆదేశాలను ఉల్లంఘిస్తూ కేంద్రం ఈ ఆర్డినెన్స్ తెచ్చిందని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది.
సుప్రీంకోర్టు ఇటీవల చెప్పిన తీర్పులో.. పోలీసులు, ప్రజాభద్రత, భూములు మినహా మిగిలిన అన్ని సర్వీసులను ఎన్నికైన ప్రభుత్వానికి అప్పగించాలంటూ ఆదేశాలిచ్చింది. అయితే ఈ తీర్పు వెలువడిన వారానికే ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, నియామకాలను ఎల్జీ కంట్రోల్‌లో ఉండేలా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీనిపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఈ దిశగా పలు రాష్ట్రాల్లో ఆయన పర్యటిస్తున్నారు. పార్లమెంటులో ఆర్డినెన్స్ చట్టరూపం దాల్చకుండా తిప్పికొట్టాలని ఆయా పార్టీలను ఆయన కోరుతున్నారు. ఇప్పుడు మేలుకోకుంటే ఇతర రాష్ట్రాలకూ ఈ ఆర్డినెన్స్ వర్తింపజేస్తారని కూడా ఆయన ప్రచారం సాగిస్తున్నారు. జూలై 3 నుంచి ఆర్డినెన్స్ ప్రతులను తగులబెట్టడం ద్వారా తమ ఆందోళనను ముందుకు తీసుకువెళ్లాలని కూడా ఆప్ ఆలోచనగా ఉంది.