Atishi UK visit: అతిషి లండన్ పర్యటనకు కేంద్రం క్లియరెన్స్

ABN , First Publish Date - 2023-06-07T16:07:19+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి వచ్చే వారంలో లండన్‌లో జరుపనున్న అధికార పర్యటనకు కేంద్రం పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం బుధవారంనాడు తెలియజేసింది.

Atishi UK visit: అతిషి లండన్  పర్యటనకు కేంద్రం క్లియరెన్స్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి (Atishi) వచ్చే వారంలో లండన్‌లో (United Kingdom) జరుపనున్న అధికార పర్యటనకు కేంద్రం పొలిటికల్ క్లియరెన్స్ (political clearance) ఇచ్చింది. ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం బుధవారంనాడు తెలియజేసింది. తన యూకే పర్యటనకు అవసరమైన అనుమతులు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ జూన్ 6న హైకోర్టును అతిషి కోరారు.

దీనిపై కేంద్రం తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేస్తూ, రాష్ట్ర మంత్రి ప్రతిపాదనను తదుపరి అనుమతుల కోసం ఆర్థిక వ్యవహారాల శాఖకు కేంద్రం పంపిందని, అది ప్రోసెస్‌లో ఉందని, తగిన వీసా అనుమతుల కోసం పిటిషనర్ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) బుధవారంనాడు ఉదయం క్లియరెన్స్ ఉచ్చినట్టు అతిషి తరఫు న్యాయవాది చెప్పారు. కాగా, హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వనక్కర లేకుండానే మంగళవారంనాడే అతిషి పర్యటనకు అనుమతి ఇచ్చినట్టు జస్టిస్ చంద్ర ధరి సింగ్‌కు కేంద్రం తరఫు లాయర్ తెలిపారు.

14 నుంచి 20 వరకూ అతిషి పర్యటన

షెడ్యూల్ ప్రకారం జూన్ 14 నుంచి 20వ తేదీ వరకూ యూకే అతిషి పర్యటిస్తారు. ''ఇండియా ఎట్ 100: టువార్డ్స్ బికమింగ్ ఎ గ్లోబల్ లీడర్'' అనే అంశంపై జూన్ 15న జరగనున్న కాన్ఫరెన్స్‌లో మాట్లాడేందుకు కేంబ్రిడ్జి యూనివర్శిటీ తనను అధికారికంగా ఆహ్వానించినట్టు అతిషి తన పిటిషన్‌లో హైకోర్టుకు తెలిపారు. విద్య, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి రంగంలో ఢిల్లీ అడ్వాన్స్‌మెంట్‌ను చాటిచెప్పేందుకు తన పర్యటన కీలకమవుతుందని, కేంద్రం అనుమతి మంజూరు చేయడంలో జాప్యం జరిగితే తన పర్యటన ఉద్దేశం దెబ్బతింటుందని కోర్టుకు మంత్రి విన్నవించారు.

Updated Date - 2023-06-07T17:04:33+05:30 IST