Cabinet Expansion: అతిషికి సర్వీసెస్ శాఖ.. ఎల్జీ ఆమోదానికి పంపిన సీఎం

ABN , First Publish Date - 2023-08-08T14:28:10+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మంత్రివర్గ విస్తరణ చేశారు. ప్రజాపనుల శాఖ మంత్రి అతిషికి సర్వీసులు, విజెలెన్స్ శాఖలను అదనంగా అప్పగించారు. ఈ నియామకాలను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదానికి పంపారు.

Cabinet Expansion: అతిషికి సర్వీసెస్ శాఖ.. ఎల్జీ ఆమోదానికి పంపిన సీఎం

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) చేశారు. ప్రజాపనుల శాఖ మంత్రి అతిషి (Atishi)కి సర్వీసులు, విజెలెన్స్ శాఖలను (Services, Vigilance Departments) అదనంగా అప్పగించారు. ఈ నియామకాలను లెఫ్టినెంట్ గవర్నర్ (LG) వీకే సక్సేనా (VK Saxena) ఆమోదానికి పంపారు. గత ఆరు నెలల్లో కేజ్రీవాల్ మంత్రివర్గ విస్తరణ చేయడం ఇది రెండోసారి.


ఢిల్లీ మంత్రివర్గంలో ఏకైక మహిళా మంత్రిగా ఉన్న అతిషి చేతిలో ప్రస్తుతం 14 శాఖలు ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వంలో ప్రస్తుతం అత్యధిక శాఖలు చేతిలో ఉన్న మంత్రి కూడా ఆమెనే కావడం విశేషం. గత జూన్‌లో కేజ్రీవాల్ జరిపిన తొలి క్యాబినెట్‌ విస్తరణలో అతిషికి రెవెన్యూ, ప్లానింగ్, ఆర్థిక శాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ మూడు శాఖలు ఇంతకుముందు రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ చేతిలో ఉండేవి. దీనికి ముందు గత మార్చిలో ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంలో జైలులో ఉన్న మనీష్ సిసోడియా చేతిలో ఉన్న విద్యాశాఖను అతిషికి కేజ్రీవాల్ అప్పగించారు. దేశ రాజధానిలో సీనియర్ అధికారుల నియామకంపై కేంద్రానికి అధికారం కట్టబెడుతూ రాజ్యసభలో ఢిల్లీ సర్వీసుల బిల్లు సోమవారంనాడు ఆమోదించిన కొద్ది గంటల్లోనే అతిషికి కేజ్రీవాల్ ప్రభుత్వం సర్వీసుల శాఖను అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Updated Date - 2023-08-08T14:28:10+05:30 IST