Delhi Pollution:ఢిల్లీలో స్కూళ్లు బంద్.. నిర్మాణ పనులపై నిషేధం.. ఎందుకంటే?
ABN , First Publish Date - 2023-11-02T21:31:02+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం(Delhi Pollution) వణికిస్తోంది. శీతాకాలానికి తోడు కాలుష్యంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అప్రమత్తమైన కేజ్రీవాల్(Arvind Kejriwal) సర్కార్ రెండు రోజులపాటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో బడులకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం(Delhi Pollution) వణికిస్తోంది. శీతాకాలానికి తోడు కాలుష్యంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అప్రమత్తమైన కేజ్రీవాల్(Arvind Kejriwal) సర్కార్ రెండు రోజులపాటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో బడులకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాయుకాలుష్యం కారణంగానే సెలవులు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ, ప్రైవేటు బడులకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అదే టైంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో రాజధాని ప్రాంతంలో చేపడుతున్న పలు నిర్మాణ పనులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్(Delhi - NCR Region) పరిధిలో అనవసరమైన నిర్మాణ కార్యకలాపాలను కేంద్ర కాలుష్య నియంత్రణ ప్యానెల్(Central Pollution Control Panel) నిషేధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) కూడా ఢిల్లీలో డీజిల్ వాహనాల రాకపోకల్ని నిషేధించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 3లో భాగంగా శీతాకాలంలో వాయుకాలుష్యాన్ని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 402 పాయింట్ల వద్ద ఉంది.
కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. జీఆర్ఏపీ 3వ దశలో ప్రభుత్వ ప్రాజెక్టులు, మైనింగ్, స్టోన్ క్రషింగ్ మినహా అన్ని నిర్మాణ, కూల్చివేత పనులపై నిషేధం ఉంటుంది. డీజిల్ వాహనాలకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుంది. ఢిల్లీలో AQI 400 మార్కును అధిగమించిన ప్రాంతాలు.. ఆనంద్ విహార్ (450), బవానా (452), బురారీ క్రాసింగ్ (408), ద్వారకా సెక్టార్ 8 (445), జహంగీర్‌పురి (433), ముండ్కా (460), NSIT ద్వారక (406) , నజాఫ్‌గఢ్ (414), నరేలా (433), నెహ్రూ నగర్ (400), న్యూ మోతీ బాగ్ (423), ఓఖ్లా ఫేజ్ 2 (415), పట్పర్‌గంజ్ (412), పంజాబీ బాగ్ (445), ఆర్‌కే పురం (417), రోహిణి ( 454), షాదీపూర్ (407), వజీర్‌పూర్ (435). వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. రాబోయే మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది. ఢిల్లీ హైకోర్టు సైతం వాయు నాణ్యత పెంపుదలకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాలుష్యంతో ప్రజలు ఆస్తమా తదితర వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని.. సమస్యను త్వరగా పరిష్కరించాలని సూచించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం వాయు నాణ్యత సూచి 0-50 మధ్య ఉంటే "మంచిది", 51-100 "సంతృప్తికరమైనది", 101-200 "మితమైన", 201-300 "పేలవమైనది", 301-400 "చాలా పేలవమైనది", 401-500 "తీవ్రమైనది"గా పరిగణిస్తారు. 500 కంటే ఎక్కువ AQI "తీవ్రమైన" విభాగంలోకి వస్తుంది.