Police Fight: ఆదర్శ పోలీసులు.. లంచం పంచుకోవడంలో గొడవ తలెత్తడంతో కొట్టుకున్నారు

ABN , First Publish Date - 2023-09-18T21:49:05+05:30 IST

బిహార్ రాష్ట్రం నలంద జిల్లాలో ఇద్దరు పోలీసులు లంచం పంచుకునే విషయంలో గొడవకు దిగారు. నలందలోని ఓ రోడ్డుపై పోలీసులు బండి ఆపారు. అందులోంచి దిగిన ఓ పోలీస్ లంచం విషయమై మరో పోలీసుతో గొడవకు దిగాడు. మాట్లాడుతుండగా జీపులో ఎక్కడానికి వెళ్తున్న పోలీసును మరొకరు లాఠీతో కొట్టాడు.

Police Fight: ఆదర్శ పోలీసులు.. లంచం పంచుకోవడంలో గొడవ తలెత్తడంతో కొట్టుకున్నారు

లంచం తీసుకున్న వారిని కటకటాల్లోకి నెట్టించే పని చేసే పోలీసులే అడ్డదారులు తొక్కితే.. ఇంకేమైనా ఉంటుందా. లంచాలు లేని పాలన అందించాలనే ప్రభుత్వాల ఆశయాలకు ఆదిలోనే తూట్లు పొడిచినట్లు కాదా.. కొందరు పోలీసుల పనులు చూస్తే సాధారణ పౌరులకు అభద్రతాభావం పెరిగిపోతోంది. తాజా సంఘటన లంచావతారం ఎత్తిన ఇద్దరు పోలీసులకు సంబంధించిందే.. బిహార్ రాష్ట్రం నలంద జిల్లాలో ఇద్దరు పోలీసులు లంచం పంచుకునే విషయంలో గొడవకు దిగారు. నలందలోని ఓ రోడ్డుపై పోలీసులు బండి ఆపారు. అందులోంచి దిగిన ఓ పోలీస్ లంచం విషయమై మరో పోలీసుతో గొడవకు దిగాడు. మాట్లాడుతుండగా జీపులో ఎక్కడానికి వెళ్తున్న పోలీసును మరొకరు లాఠీతో కొట్టాడు.


ఇద్దరు చొక్కాలు పట్టుకుని ఒకరిని ఒకరు తోసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నింటినీ స్థానికులు వీడియో తీశారు. గొడవ సమయంలో ఉన్నతాధికారులకు విషయం తెలిస్తే సస్పెండ్ చేస్తారని స్థానికులు వారించినా వారు వినకపోవడం గమనార్హం. మొబైల్ లో రికార్డు చేసిన వీడియోను సోషల్ మీడియాలో ఉంచడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. వారిద్దరినీ సస్పెండ్ చేయాలని చాలా మంది కామెంట్ చేశారు. ఈ వీడియోపై జిల్లా పోలీసు అధికారులు స్పందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-18T21:49:05+05:30 IST