Congress: కాంగ్రెస్ భారీ ప్లాన్...భారత్ జోడో తరహాలో 'క్రాస్-కంట్రీ మార్చ్'

ABN , First Publish Date - 2023-02-26T18:16:57+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో మూడురోజుల పాటు జరిగిన కాంగ్రెస్ 85వ ప్లీనరీ ఆదివారం ముగుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో భారీ ప్లాన్‌తో ప్రజల..

Congress: కాంగ్రెస్ భారీ ప్లాన్...భారత్ జోడో తరహాలో 'క్రాస్-కంట్రీ మార్చ్'

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో మూడురోజుల పాటు జరిగిన కాంగ్రెస్ 85వ ప్లీనరీ ఆదివారం ముగుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో భారీ ప్లాన్‌తో ప్రజల ముందుకు రాబోతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 135 రోజుల పాటు రాహుల్ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' ఇటీవల ముగియడం, ఆ వెనువెంటనే మూడు రోజుల ప్లీనరీ జరుపుకోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం తొంగిచూస్తోంది. కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల వరకూ ఇదే వాడివేడిని కొనగించేందుకు కాంగ్రెస్ మరో కొత్త వ్యూహానికి తెరలేపనుంది. 'భారత్ జోడో' తరహాలోనే ప్రజలతో మమేకమయ్యే ''క్రాస్ కంట్రీ మార్చ్' (Cross-Country March)కు సిద్ధమవుతోంది. ఈసారి తూర్పు నుంచి పశ్చిమం (East To West) వరకూ ఈ పాదయాత్ర సాగనుందని పార్టీ వర్గాలు సమాచారం.

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ మాస్ కాంటాక్ట్ ప్రోగ్రాం (క్రాస్ కంట్రీ మార్చ్) ఊపందుకునేలా కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహరచన చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఇంకా దీనికి ఒక తుది రూపు రాలేదని ఆ వర్గాలు చెబుతున్నాయి.

క్యాడర్‌లో ఉత్తేజం నింపిన భారత్ జోడో...

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా పార్టీలో జవజీవాలు లోపించడం ఆ పార్టీని క్రుంగదీస్తూ వచ్చింది. పలు రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడం, కేవలం 3 రాష్ట్రాలకే పరిమితం కావడం, రెండు లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ కుదేలయింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' విజయవంతం కావడం ఆ పార్టీకి మళ్లీ కొత్త ఊపిరినిచ్చింది. పార్టీకి కొత్త అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేని ఎన్నుకోవడం, భారత్ జోడో యాత్ర సఫలం కావడం, రాయపూర్ ప్లీనరీ సైతం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగడం ఆ పార్టీని సంతోషంలో ముంచెత్తుతోంది. పార్టీ ప్లీనరీలోనూ భారత్ జోడో యాత్ర ప్రస్తావన పదేపదే చోటుచేసుకుంది. 135 రోజుల పాటు సాగిన భారత్ జోడో యాత్ర గత ఏడాది సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమై ఈ ఏడాది జనవరి 30న జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగిసింది. 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సుమారు 3,970 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగింది.

Updated Date - 2023-02-26T18:19:55+05:30 IST