Chief Minister: రాష్ట్రంలో శాటిలైట్‌ సిటీలను నిర్మిస్తాం..

ABN , First Publish Date - 2023-02-19T08:24:53+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా శాటిలైట్‌ సిటీ (శివారు నగరాలు)లను నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రకటించారు

Chief Minister: రాష్ట్రంలో శాటిలైట్‌ సిటీలను నిర్మిస్తాం..

- ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌

అడయార్‌(చెన్నై), ఫిబ్రవరి 18: రాష్ట్రంలో కొత్తగా శాటిలైట్‌ సిటీ (శివారు నగరాలు)లను నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రకటించారు. అలాగే, పేద, మధ్య తరగతి ప్రజలకు చౌక ధరలకు గృహాలను అందించేందుకు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ యజమానులు(క్రెడాయ్‌) ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక నందంబాక్కంలోని చెన్నై ట్రేడ్‌ సెంటరులో క్రెడాయ్‌ ఆధ్వర్యంలో శనివారం ‘అన్‌ లివింగ్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ విజన్‌ 2023’ పేరుతో జరిగిన ఒక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నాగరిక మనిషి జీవన విధానంలోని అతి ముఖ్యమైన అంశాల్లో ఒకటైన గృహ వసతిని రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. రాష్ట్రాభివృద్ధి అంటే ప్రతి ఒక్కరి అభివృద్ధిగా భావించి, దీన్ని లక్ష్యంగా పెట్టుకుని తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, మహిళాభివృద్ధి, పర్యావరణం వంటి అన్ని శాఖలపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని తెలిపారు. గుడిసె రహిత రాష్ట్రంగా చేయాలన్న బృహత్తర సంకల్పంతోనే 50 యేళ్ళ క్రితమే రాష్ట్రంలో తమిళనాడు మురికివాడల నిర్మూలన సంస్థ (తమిళనాడు స్లమ్‌ క్లియరెన్స్‌ బోర్డు)ను దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నట్టు తెలిపారు. ఆయన వేసిన బాటలోనే తమ ప్రభుత్వం నడుస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింప జేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 1991లో 1.90 కోట్లుగా ఉన్న నగర జనాభా 2011 నాటికి 3.49 కోట్లు కాగా, ఇది వచ్చే 2031 నాటికి 5.34 కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం తమిళనాడు(Tamil Nadu)లో 832 నగరాలు(పట్టణాలు) ఉన్నాయన్నారు. రాష్ట్ర జనాభాలో 49 శాతం మంది జనాభా నగర ప్రాంతాల్లో నివస్తున్నారని తెలిపారు. ఫలితంగా పట్టణీకరణలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ‘అన్నీ అందరికీ’ అనే ప్రాథమిక లక్ష్యంతో కొత పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు. 2030 నాటికి ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, కొనుగోలు చేయగల సామర్థ్యంతో కూడిన గృహాలను, మౌలిక సదుపాయాల రూపకల్పన, మురికివాడల అభివృద్ధి, పట్టణీకరణ, నగరాలు, పట్టణాలు, గ్రామ శివారు ప్రాంతాల మధ్య అనుసంధానం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పారిశ్రామిక రంగంలో కాలంతో పాటు మా రుతున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వం కూడా స్పందిస్తూ తదనుగుణంగా ముందుకు సాగుతుందన్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా శాటిలైట్‌ సిటీలను నిర్మించాలని సంకల్పించినట్టు చెప్పారు.

ఔటర్‌ రింగ్‌ రోడ్లకు చర్యలు

బాహ్య వలయాకార రహదారుల (ఔటర్‌ రింగ్‌ రోడ్లు) నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి చర్యల వల్ల మున్ముందు రియల్‌ ఎస్టేట్‌ రంగం మరింతగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. చెన్నై నగరం(Chennai city)లో రోజురోజుకూ జనాభా పెరిగిపోతుందని, వారికి అవసమైన గృహ వసతిని చౌక ధరకు కల్పించాల్సిన బాధ్యతను క్రెడాయ్‌ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెట్టుబడులు, పరిశ్రమల శాఖా మంత్రి తంగం తెన్నరసు, గృహ నిర్మాణ, నగరాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అపూర్వ, క్రెడాయ్‌ తమిళనాడు ప్రెసిడెంట్‌ సురేష్‌ కృష్ణన్‌, క్రెడాయ్‌ చెన్నై విభాగం అధ్యక్షుడు శివగురునాథన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-19T08:24:56+05:30 IST